బి.సి లను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి
బి.సి కమీషన్ కు నివేదించిన ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్
75 ఏండ్ల స్వాతంత్ర భారతంలో మొట్టమొదటి సారి చేపడుతున్న సమగ్ర బి.సి జనగణన చట్టం ముందు నిలిచేవిధంగా ఉండాలని, ఆ దిశగా బి.సి సమాజ సమస్యలను గుర్తించి, సమగ్ర కుల జనగణనకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చి తెలంగాణలో కుల జనగణన జరిపి తద్వారా స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం చేసే ప్రయత్నాలకు బి.సి సమాజం పక్షాన ఆల్ ఇండియా ఒబిసి జాక్ ఛైర్మెన్ సాయిని నరేందర్ ధన్యవాదాలు తెలుపుతూ 35 డిమాండులతో కూడిన తన నివేదికను బి.సి కమీషన్ కు అందించి శనివారం హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన బహిరంగ విచారణలో ప్రసంగించారు.
సమగ్ర కుల జనగణన జరపాలని ఆ జనగణన చట్టం ముందు నిలబడే విధంగా సమగ్రంగా ఉండాలని, కుల జనగణలో అతి ముఖ్యమైన సమాచారాన్ని సమగ్రంగా సేకరించాలని, బి.సి ల సామాజిక, ఆర్థిక స్థితిగతులను స్పష్టంగా లెక్క వేయాలని, స్త్రీ, పురుషుల సామాజిక, ఆర్థిక అభివృద్ధి గురించి లెక్కలు తీయాలని, విద్యార్హతలు, వృత్తి, స్వంత ఇల్లు, ఆస్తులు, మంచినీటి సౌకర్యాలు, వంట గ్యాస్ తదితర సౌకర్యాల అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు.
సకల సామాజిక రంగాల్లో బి.సి ల జనాభా దామాషా ప్రకారం వాటా కేటాయించి వారి సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని, ఆదిమ కాలం నుండి ఆధునిక కాలం వరకు దేశానికి వెన్నుముకగా ఉన్న బి.సి సమాజం ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పారిశ్రామికీకరణ తదితర సామాజిక మార్పులు, పాలకుల విధానాల వల్ల కుల వృత్తులు ధ్వంసమై బ్రతుక లేక బలిదానాలు చేసుకుంటున్నారని, ప్రధాన వృత్తులు ధ్వంసమైన నేటి తరుణంలో కుల వృత్తులను ఆధునీకరించి ఆయా కులాల ప్రజల ఆర్థిక ఎదుగుదలకు ప్రభుత్వం తోడ్పడాలని డిమాండ్ చేశారు. బి.సి ల ప్రధాన ఆధారమైన వ్యవసాయం, వారి ఉత్పత్తులు ప్రపంచ పోటీని ఎదుర్కోలేక పోతున్నాయని, వ్యవసాయాధారిత ప్రజలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించి ప్రత్యామ్నాయ వ్యవసాయం వైపు మరల్చి ప్రపంచానికి వ్యవసాయ ఎగుమతులను పెంచాలని తెలిపారు. వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడే వ్యవసాయ కళాశాలలను పెంచి వ్యవసాయ పట్టభద్రులను తయారు చేసి తద్వారా వ్యవసాయ అభివృద్ధికి కృషి చేయాలని, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయాన్ని మార్చే ప్రణాళికలు రూపొందించి బి.సి సమాజాన్ని కాపాడాలని, వ్యవసాయ ఉత్పత్తులను ఉచితంగా నిలువ చేసుకునే గిడ్డంగులను నిర్మించాలని, ఉత్పత్తులను గిడ్డంగులలో నిలువ ఉన్న సమయంలో రైతులకు వడ్డీ లేని తాత్కాలిక రుణాలు ఇవాలని విజ్ఞప్తి చేశారు.
ఉత్పత్తి రంగం నుండి సేవా రంగంలోకి మారిన వారికి నిత్యం పని దొరకక చాలీ చాలని వేతనాలు, పెరిగిన జీవన ఖర్చులకు సరిపోయే ఆదాయం లేక అప్పులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఉన్నత చదువులు చదివిన వారికి ఉద్యోగాలు, ఉపాధి లేకపోవడంతో ఎలాంటి భద్రత, రేపటికి గ్యారంటీ, కార్మిక హక్కులు లేని రాపిడో, వోలో లాంటి వాహనాలు నడుపుతూ, స్విగ్గీ జోమాటో లాంటి సంస్థలలో మెజార్టీ బి.సి యువత అసంఘటిత రంగంలో సేవ చేస్తుంది. ప్రైవేటు విద్యా, వైద్య ఖర్చులతో నానాటికి పెరుగుతున్న జీవన ఖర్చులను భరించలేక అప్పుల పాలై కుటుంబాలను విడిచి పారిశ్రామిక నగరాలకు, విదేశాలకు వలసలు పోతున్నారు. ఏ దారి లేని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రైవేట్ విద్యా, వైద్యాన్ని అదుపు చేసి, ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను మరింత అభివృద్ధి చేయాలి. సమాన విద్యను అమలు చేసి విద్యా అసమానతలను తొలగిస్తే సమాజానికి చాలా మేలు జరుగుతుందని నివేదించారు.
ప్రైవేటీకరణలో కార్పొరీకరణ వల్ల పెద్ద మాల్స్ రావడం వల్ల చిరు వ్యాపారాలు, మధ్యస్థ వ్యాపారాలు, విద్యా సంస్థలపై ఆధారపడిన బి.సి సమాజం తీవ్రంగా నష్టపోతుంది. నిరుద్యోగ సమస్య బి.సి సమాజంలో ఎక్కువగా ఉంది. పి జి, పి హెచ్ డి లు చదివినా, గోల్డ్ మెడల్ కొట్టినా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులుగానే వారి జీవితాలను ముగిస్తున్నారు. నిరుద్యోగులపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఉపాది అవకాశాలు పెంచాలి. ఓపెన్ కాస్ట్, రోడ్లు, ప్రాజెక్టులు తదితర అభివృద్ధి పేరుతో విద్వంసం జరిగి నిరాశ్రయులైన వారిని అన్ని రకాలుగా ఆదుకోవాలి. గ్రామాల్లో ఉపాధి కరువై పట్టణాలకు వలస వచ్చి అడ్డ మీద కూలీలుగా బతుకుతున్నవారికి, నివాసం లేక, ఫుట్ పాత్ లపై జీవనం గడుపుతున్నారు. అలాంటి వారికి ఆసరాగా నిలవాలి. స్వంత భూమి లేక కౌలు రైతులుగా బి.సి సమాజం ఎన్నో నష్టాలకు లోనవుతుంది. భూమి లేని పేద బి.సి లకు 5 ఎకరాల భూమి కేటాయించాలి. పట్టణ, గ్రామం తేడా లేకుండా వారు నివాసం ఉండే దగ్గర కనీసం 100 గజాల ఇంటి స్థలం, గృహ నిర్మాణానికి సహకారం అందించాలి. ప్రతి ఒక్కరికీ పౌష్టికాహారం అందించాలి. ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు పౌష్టికాహారం అందించి ఆరోగ్య సమాజాన్ని నిర్మించాలి. సకల సమస్యలతో సతమవుతూ అప్పుల పాలవుతున్న బి.సి సమాజం మద్యానికి బానిసలై 40 ఏండ్లు నిండకముందే మరణిస్తుడడంతో కుటుంబాలు, బావితరం చింద్రం అవుతుంతుంది. విచ్చల విడి మద్యం అమ్మకాలను అరికట్టాలి. క్రమంగా మద్యపానాన్ని నిషేధించాలి. ఏ వర్గాల్లో లేని క్రిమీలేయర్ విధానాన్ని బి.సి లో ఎత్తి వేయాలి. జాతీయ న్యాయ కళాశాలల్లో, జుడీషియరీలో బి.సి లకు రిజర్వేషన్లు కల్పించాలి. బి.సి సమాజానికి నష్టం చేస్తున్న ఇ డబ్లు ఎస్ రిజర్వేషన్లను ఎత్తివేయాలి. చట్టసభల్లో బి.సి లకు జనాభా దామాషా ప్రకారం వాటా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పోరాటం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ లో చేసిన వాగ్దానం ప్రకారం బి.సి లకు అన్ని స్థాయిల ఎన్నికల్లో సీట్లు అధికంగా కేటాయించాలి. బి.సి లు రాజకీయంగా ఎదగడం కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలి. మంత్రి పదవుల్లో బి.సి లకు 50 శాతం కేటాయించాలి. పబ్లిక్ సర్వీస్ కమీషన్ల లాంటి నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బి.సి లకు కేటాయించాలి. కామారెడ్డి డిక్లరేషన్ లో పొందుపరచిన అన్ని అంశాలను నిర్లక్ష్యం చేయకుండా అమలు చేయాలి. జాతీయ స్థాయిలో జరిగే జనగణనలో బి.సి జనగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. అత్యంత వెనుకబడిన తరగతులు (ఎం బి సి), సంచార జాతుల స్థితిగతులను సర్వే పై ప్రత్యేక దృష్టి సారించాలి. కుల కార్పొరేషన్లను బలోపేతం చేయాలని, ఎం బి సి ల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆ నివేదికలో పేర్కొన్నారు.