జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
సిరా న్యూస్,కరీంనగర్;
సమగ్ర కుటుంబ సర్వేకై ఇండ్లకు వచ్చే ఎన్యుమరేటర్లకు ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు.
బుధవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇళ్లకు స్టిక్కరింగ్ అంటించే ప్రక్రియను కలెక్టర్ అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ స్థానిక సంస్థలు, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్ పరిశీలించారు. తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ గ్రామపంచాయతీలోని ఆరో వార్డులో, చిగురుమామిడి మండలం రేగొండ పంచాయతీ పరిధిలోని పెద్దమ్మపల్లి గ్రామంలోని 13వ వార్డులో, చిగురుమామిడి మండల కేంద్రంలోని పదోవార్డులో ఇళ్లకు స్టిక్కరింగ్ అంటించే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటింటి సర్వే సందర్భంగా సేకరించిన వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని, ఎవరికీ సమాచారాన్ని వెల్లడి చేయడం జరగదని, అందువల్ల ప్రజలు వివరాలు ఇచ్చే విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సర్వే కోసం వచ్చిన ఎన్యుమరేటర్లకు సరైన సమాచారాన్ని ఇచ్చి సహకరించాల్సిందిగా కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నదని, అందువలన తప్పు సమాచారం ఇవ్వకుండా సరైన సమాచారాన్ని ఇస్తే భవిష్యత్తులో ఈ సమాచారం ఉపయోగపడేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఇంటింటి సర్వే కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, ఈనెల 6 నుండి 8 వరకు ఇండ్లను సందర్శించి ఇండ్ల జాబితాను రూపొందించడం జరుగుతుందని, అనంతరం సర్వేకు ప్రభుత్వం రూపొందించిన సుమారు 75 కాలంలలో వివరాల సేకరణ చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ప్రజలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ధరణి పట్టాదారు పాస్ బుక్ వంటివి సిద్ధంగా ఉంచుకుని ఎన్యుమరేటర్లకు అందుబాటులో ఉండి సమాచారం ఇచ్చి సహకరించాలని సూచించారు, సర్వే ఫారంలో ఎన్యుమరేటర్లు ఎట్టి పరిస్థితులలో తప్పులు నింపవద్దని, ఏవైనా సందేహాలు ఉంటే సూపర్వైజర్లు, లేదా మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. ఇండ్ల జాబితా తయారీ సందర్బంగా ఇంటిని సందర్శించినట్లుగా స్టిక్కర్ అతికించాలని చెప్పారు. సర్వే ఫారం లో పూర్తి వివరాలను నింపాలని, ప్రతి ఇంటికి వెళ్లి సేకరించిన డేటాను ఆన్లైన్ చేయడం జరుగుతుందని తెలిపారు.
సర్వే విషయంలో అనుమానాలు ఉంటే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు.
సర్వేకు అవసరమైన వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని యజమానులకువివరించి చెప్పాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ ఎంపీడీవో టి. విజయ్ కుమార్, తహసీల్దార్ కె. విజయ్ కుమార్, కార్యదర్శి శ్రీవాణి, చిగురుమామిడి ఎంపీడీవో మధుసూదన్, ఆర్ఐ సంతోష్, కార్యదర్శులు అజయ్ కుమార్, రమేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.