సిరా న్యూస్,విజయనగరం;
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు విడుదల నోటిఫికేషన్ నిరర్థకమయింది. ఇందుకూరి రఘురాజుపై మండలి చైర్మన్ వేసిన అనర్హతా వేటు చట్ట విరుద్దమైనదిగా హైకోర్టు ప్రకటిచింది. దీంతో ఎన్నిక ఆగిపోయినట్లయింది. ఎన్నికల సమయంలో ఇందుకూరి రఘురాజు కుటుంబసభ్యులు టీడీపీలో చేరారు.కానీ రఘురాజు పార్టీ మారలేదు. అయితే టీడీపీకి మద్దతుగా పని చేస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ నేతలు మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. రఘురాజు నుంచి వివరణ తీసుకోకుండానే అనర్హతా వేటు వేశారు. తాను ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించలేదని తనపై వేసిన అనర్హతా వేటు చెల్లదని రఘురాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ విచారణలో ఉండగానే ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా విచారణలో మండలి చైర్మన్ వేసిన అనర్హతా వేటును హైకోర్టు రద్దు చేయడంతో రఘురాజునే ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం పార్టీ మారితేనే అనర్హతా వేటు వేయాలి. అయితే శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు పార్టీ మారికపోయినా ఇతర పార్టీల ప్రచారంలో పాల్గొన్నారని చెప్పి అనర్హతా వేటు వేశారు.ఆయన వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ.. మండలి చైర్మన్ కూడా వైసీపీ నేత కావడంతో అర్థరాత్రి సమయంలో అనర్హతా వేటు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇలా కారణం లేకుండా.. చట్టాన్ని ఉల్లంఘించకపోయినా అనర్హతా వేటు వేయడం రాజ్యాంగ విరుద్ధమని రఘురాజు కోర్టుకెళ్లారు.విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో సోమవారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నాయి.అయితే ఇంకా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. తెలుగుదేశం పార్టీ కూడా ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. అయితే వైసీపీకి మాత్రం ఎన్నికకు రెడీ అయిది. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడును వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బుధవారమే ఖరారు చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన నేతలంతా వెళ్లి జగన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థిని ఖరారు చేశారు. కాసేపటికే హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఎన్నిక ఉండదని తేలిపోయింది. విజయనగరం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపికి పూర్తి మెజార్టీ ఉంది.గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ ఎన్నికలను బాయ్ కాట్ చేయడంతో అత్యధిక స్థానాలను వైసీపీ గెల్చుకుంది.అందుకే ఎన్నిక జరిగితే వైసీపీనే విజయం సాధించేది.అయితే ఇప్పుడు ఎన్నిక రద్దు అయింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘురాజు 2027 నవంబర్ వరకూ ఎమ్మెల్సీగా కొనసాగుతారు.