కృష్ణానదిలో దూసుకువెళ్లి బోల్తా కొట్టిన కారు
చల్లపల్లి నుంచి విజయవాడ వెళుతుండగా ఘటన
ఒకరికి తీవ్రగాయాలు – ఒకరికి తలకు గాయం
క్షతగాత్రుడిని కట్ట కింద నుంచి రోడ్డు పైకి చేర్చేందుకు తీవ్రంగా శ్రమించిన పైలట్ షఫీ
తక్షణ చికిత్స అందించిన ఈఎంటీ అశ్వనికుమారి
విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
కృష్ణానది కరకట్టపై కారు అదుపుతప్పి నది వైపు దూసుకుపోయింది. ఆదివారం అర్ధరాత్రి ఘంటసాల మండలం పాపవినాశనం ఆశ్రమం సమీపంలోని మలుపులో ఈ ఘటన జరిగింది. విజయవాడకు చెందిన సయ్యద్ కలీం, సయ్యద్ అలీ దాదా, షేక్ మెహబూబ్ కారులో చల్లపల్లి వచ్చి తిరిగి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. దారిన పోయే వాహనదారులు ప్రమాదాన్ని గమనించి 108కు సమాచారం అందించారు. చల్లపల్లి నుంచి 108 సిబ్బంది ఈఎంటీ బండ్రపల్లి అశ్వని, పైలట్ అబ్దుల్ షఫీ ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటన స్థలిలో తిరగబడి నుజ్జునుజ్జయిన కారులో సయ్యద్ అలీదాదాకు తీవ్ర గాయాలై రెండు చేతులు విరిగాయి. సయ్యద్ కలీం తలకు గాయమైంది. మెహబూబ్ స్వల్ఫ గాయాలతో బయటపడ్డాడు. కారు కట్ట కింద నదిలో దాదాపు పదిహేను అడుగుల లోతులో ఉండటంతో క్షతగాత్రులను పైకి చేర్చేందుకు పైలట్ అబ్దుల్ షఫీ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. తీవ్ర గాయాలకు గురైన అలీదాదాను ఏటవాలుగా ముళ్ల పొదలతో ఉన్న కరకట్టపైకి చేర్చటం అసాధ్యం కావటంతో పైలట్ షఫీ అతనిని స్కూప్ పై పడుకోబెట్టి తాళ్లతో కట్టి స్థానికుల సహకారంతో తీవ్రంగా శ్రమించి రోడ్డు పైకి చేర్చాల్సి వచ్చింది. అంబులెన్సు ఈఎంటీ అశ్వని కుమారి తక్షణ చికిత్స అందించిన అనంతరం అతనిని బంధువులు ప్రైవేట్ వాహనంలో విజయవాడ ఆసుపత్రికి తరలించారు. స్వల్ఫ గాయలకు గురైన సయ్యద్ కలీంను అంబులెన్సులో చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.