టీడీపీ మెంబర్ షిప్ కు భారీ స్పందన

సిరా న్యూస్,గుంటూరు;
ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలే బలం. వారి బలంతోనే కొందరు నాయకులుగా ఎదుగుతారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతుంటారు. అందుకే టిడిపి అధికారంలో ఉన్నప్పుడూ, లేనప్పుడూ కూడా కార్యకర్తలను కాపాడుకుంటూ, ఎప్పటికప్పుడు సభ్యత్వ నమోదుతో బలం పెంచుకుంటుంది.తాజాగా టిడిపి చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేవలం రెండు వారాలలో 20 లక్షల మంది సభ్యులుగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వంద రూపాయలు కట్టి టిడిపి సభ్యత్వం తీసుకున్నవారికి రూ.5 లక్షల ప్రమాదభీమా ఇస్తుండటం ఇందుకు ఓ కారణం కాగా ప్రస్తుతం టిడిపి అధికారంలో ఉంది కనుక ఆ పార్టీలో సభ్యత్వం ఉన్నట్లయితే సమాజంలో గుర్తింపు, ఏదో సమయంలో ప్రయోజనం లభించవచ్చనే చిన్న ఆశ మరో కారణంగా కనిపిస్తోంది. కారణాలు ఏవైనప్పటికీ రాష్ట్రంలో టిడిపి బలం పెరిగింది. ఇంకా పెరుగుతుందనేది స్పష్టం.అధికారంలో ఉన్న టిడిపి సభ్యత్వాలతో పార్టీని బలోపేతం చేసుకుంటుంటే, ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయి అధికారానికి దూరమైన వైసీపి ఏం చేయాలి? అది ఇంకా చురుకుగా వ్యవహరిస్తూ సభ్యత్వ నమోదు చేపట్టి బలం పెంచుకోవాలి. కానీ జగన్‌ అధికారంలో ఉన్నప్పుడే నేతలను, కార్యకర్తలను పట్టించుకోకుండా ఐప్యాక్, వాలంటీర్లతో పాలన సాగించారు. ఇప్పుడు కూడా సోషల్ మీడియా వారియర్స్‌ని భర్తీ చేసుకుంటున్నారే తప్ప పార్టీ కార్యకర్తలని కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఒకవేళ ఎవరికైనా సమస్యలొస్తే తాడేపల్లి ప్యాలస్‌లో హెల్ప్ లైన్ నెంబర్స్, లీగస్ సెల్ ఏర్పాటు చేశామని వారిని సంప్రదించుకోవాలని జగన్‌ స్వయంగా చెప్పారు. ఓ పార్టీ అధినేత కార్యకర్తలకు దూరంగా ఉంటూ, కార్యకర్తలు కంటే సోషల్ మీడియా వారియర్స్ ముఖ్యమనుకుంటున్నారు! తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని ట్వీట్స్ వెయిస్తున్నారు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా?అన్నట్లు పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఆయననే ఫాలో అవుతూ ఇళ్ళలో కూర్చొని ట్వీట్స్ వేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఓ రాజకీయ పార్టీ ఎలా ఉండాలో… ఎలా నడపాలో టిడిపిని చూసి నేర్చుకోమని జగన్‌ అనుకూల మీడియా మొత్తుకుంటోంది కూడా. కానీ దానినీ వాడుకోవడమే తప్ప దాని హితోక్తులు పట్టించుకోవడం లేదు. జగన్‌, సీనియర్ నేతలు ఈవిదంగా వ్యవహరిస్తుంటే ఇక వైసీపి ఏవిదంగా రాజకీయంగా నిలబడగలదు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *