గుమ్మనూరు వర్సెస్ జేసీ…

సిరా న్యూస్,అనంతపురం;
ఏపీ రాజకీయాల్లో రాయలసీమ ప్రాంతం కీ రోల్ పోషిస్తుంటుంది. కానీ ఉమ్మడి అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం మాత్రం సైలెంట్ గానే ఉండేది. ఏపీ విభజన తర్వాత ఒకసారి టీడీపీ తరఫున జితేంద్ర గౌడ్.. వైసీపీ తరపున వెంకట్రామిరెడ్డి గెలిచారు. ఇద్దరు కూడ ఎక్కడ పెద్దగా వార్తల్లో నిలిచేవారు కాదు. వీరిద్దరిపై కూడా పెద్దగా రాజకీయ ఆరోపణలు లేవు. పెద్దగా వార్తల్లో నిలవని ఈ నియోజకవర్గాన్ని తన ఎంట్రీతోనే హాట్ టాపిక్ గా మార్చారు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. వైసీపీ హయాంలో కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యేగా గెలుపొంది. 2022లో మంత్రివర్గ పునర్‌‌వ్యవస్థీకరణలో మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. గత ఎన్నికల సమయంలో గుమ్మనూరు జయరాంను ఆలూరు నుంచి తప్పించి కర్నూలు ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించింది వైసీపీ. ఆలూరు ఇన్‌చార్జ్‌గా జయరాం వ్యతిరేక వర్గానికి చెందిన జడ్పీటీసీ విరుపాక్షను ప్రకటించింది. దాంతో అలకబూనిన జయరాం.. టీడీపీ గురికి చేరి.. గుంతకల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యేగా గెలిచే వరకు బాగున్నా.. ఆ తర్వాత తన సోదరులను, కుమారుడిని నియోజకవర్గంలో పెట్టి.. ఏదో చుట్టపుచూపుగా నియోజకవర్గానికి వస్తూ పోతున్నారని విమర్శలు వస్తున్నాయట. గుంతకల్ లో తన కుమారుడిని.. గుత్తిలో తన సోదరుడికి బాధ్యతలు అప్పగించి.. ఆయన మాత్రం ఆలూరు పైనే ఫోకస్ పెంచారట. ఇక్కడ సోదరుడు, కుమారుడు షాడో ఎమ్మెల్యేలుగా అధికారం చెలాయిస్తున్నారని.. ప్రత్యర్థి పార్టీతో పాటు అధికారపక్షం సభ్యులు కూడ పెద్ద ఎత్తున రాజకీయ ఆరోపణలు చేస్తున్నారట.ఇదంతా ఒక ఎత్తైతే.. రాష్ట్రంలో మొట్టమొదటిగా ఇసుక అక్రమణా రవాణా స్టార్ట్ అయింది గుంతకల్ నియోజకవర్గం నుంచి అని పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. అందులోనూ పక్క నియోజకవర్గం అయిన తాడిపత్రిలో.. ఇసుక అక్రమ రవాణా చేస్తుండడంతో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. దీనిపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ జేసీ భాకర్ రెడ్డి.. ఆ సదరు ఎమ్మెల్యే పేరు చెప్పకుండానే.. వార్నింగ్ ఇస్తున్న అంటూ సంచలనం రేపారు. ఒకవేళ నా నియోజకవర్గంలో నువ్వు వేలు పెడితే.. నేను నీ నియోజకవర్గంలో ఎంటర్ అవ్వాల్సి వస్తుంది అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం కలకలంగా మారిందట.రేషన్ బియ్యం రవాణాలో కూడా గుంతకల్ నియోజకవర్గం నుంచే స్టార్ట్ అయ్యిందని వాదనలు వినిపిస్తున్నాయట. దీనిపై విచారణ జరిపి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారట. అంతే కాకుండా మద్యం షాపులు టెండర్లపై కూడా ఎమ్మెల్యే వర్గీయులే పెత్తనం సాగించారని టీడీపీ నేతలే ఆరోపిస్తున్నారట. ఇక ఇటీవల ఓ టీడీపీ మహిళ కార్యకర్త తన భూమిని ఎమ్మెల్యే బంధువులు కబ్జా చేశారని ధర్నా చేయడంతో వారి అనుచరగణం టెన్సన్ లో పడ్డారట. దీంతో ఎమ్మెల్యే హుటాహుటిన జిల్లా కలెక్టర్ ని కలిసి.. తన పేరుతో కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారట.మరోవైపు ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణల సంగతి అటు ఉంచితే.. గెలిపించిన నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా.. ఆలూరు పైనే దృష్టిని సారించారని చర్చ నడుస్తోందట. ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి మంత్రులు వచ్చినా కూడా జయరాం.. అటువైపు కూడా వచ్చి పలకరించకుండా ఉంటున్నారని కూటమి నేతలు మండిపడుతున్నారట. ఇటీవల అనంతపురం జిల్లాలో డీఎస్పీ ల పాసింగ్ ఔట్ పరేడ్ కు హోం మంత్రి అనిత, డీజీపి ద్వారక తిరుమల రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారట. తొలిసారిగా అనంత పర్యటనకు వచ్చిన హోం మంత్రిని కలిసేందుకు జిల్లాలో అందరు ఎమ్మెల్యేలు వచ్చారట. కానీ ఒక్క గమ్మనూరు జయరాం మాత్రమే ఆ కార్యక్రమానికి హాజరు కాకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారట.నాడు వైసీపీలో ఫైర్ బ్రాండ్ అనిపించుకొని.. టీడీపీ గూటికి చేరిన ఎమ్మెల్యే జయరాం తనపై వస్తున్న ఆరోపణలకు ఏ విధంగా చెక్ పెడతారు ? జేసీ వార్నింగ్ కి బదులిస్తారా ? షాడో ఎమ్మెల్యేల వ్యవహారాన్ని చక్కబెట్టి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారా అనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయట. మరి కూతమి తమ్ముళ్లు ఎమ్మెల్యే వైఖరిపై ఎలా స్పందిస్తారు అనేది కూడా సస్పెన్స్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *