కార్పొరేటర్లకు కనీస గౌరవం ఇవ్వడం లేదు
సుబ్బారెడ్డికి స్పష్టం చేసిన దక్షిణ అసమ్మతి నేతలు
సిరా న్యూస్,విశాఖపట్నం;
దక్షిణ నియోజకవర్గం వైసీపీ అసమ్మతి నేతలు స్వరం పెంచారు. బుజ్జగింపుల పర్వానికి తెరతీసిన పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఎదుట తమ నిర్ణయాన్ని కుండ బద్దలు కొట్టారు. వాసుపల్లిని మార్చకుంటే సహకరించేది లేదని తేల్చి చెప్పారు.
నియోజకవర్గంలో కొంతమంది నేతలు వాసుపల్లికి వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తుండడంతో అధిష్ఠానం ఆదేశాల మేరకు వైవీ రంగంలోకి దిగారు. ఈ మేరకు వైవి సుబ్బారెడ్డి విశాఖ చేరుకున్న వెంటనే అసమ్మతి నేతలంతా పార్టీ కార్యాలయానికి రావాలని సమాచారం పంపించారు. దీంతో ఎమ్మెల్యే వాసుపల్లికి వ్యతిరేకంగా గళం విప్పిన కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులతోపాటు నియోజకవర్గంలోని ముఖ్యనాయకులు ఎండాడలోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. వారితో సుమారు రెండు గంటలపాటు సుబ్బారెడ్డి చర్చించారు. ఎమ్మెల్యే వాసుపల్లికి వ్యతిరేకంగా అసంతృప్తి వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఎందుకువచ్చిందనే దానిపై ఒక్కొక్కరిని ఆరా తీసి, బుజ్జగించేందుకు యత్నించినట్టు సమాచారం. అయితే వారంతా వాసుపల్లి వ్యవహారశైలి బాగోలేదని, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారిని కాకుండా తనతోపాటు టీడీపీ నుంచి వచ్చినవారికి ప్రాధాన్యం ఇస్తున్నారని సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఎట్టిపరిస్థితిలోనూ అతని కోసం పనిచేయలేమని కుండబద్దలు కొటినట్టు సమాచారం. మరెవరినైనా పోటీకి దింపితే గెలిపించుకుంటామనడంతో ఏం మాట్లాడాలో తెలియక సుబ్బారెడ్డి మౌనం వహించినట్టు తెలిసింది. నియోజకవర్గంలో వాసుపల్లి అభ్యర్థిత్వాన్ని జగన్ దాదాపు ఖరారుచేసినట్టేనని, అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలను సీఎం దృష్టికి తీసుకెళతానని అసమ్మతి నేతలకు సుబ్బారెడ్డి హామీ ఇచ్చినట్టు తెలిసింది.