సిరా న్యూస్, గొల్లప్రోలు:
మారణాయుధాలతో రెచ్చిపోయిన దుండగులు…
+ గొల్లప్రోలు మండలం చేబ్రోలులో అర్ధరాత్రి హాహాకారాలు..
+ దాడికి దిగిన గుర్తు తెలియని వ్యక్తులు
+ ఇండ్లు, షాపులను జెసిబితో కూల్చిన దుండగులు
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో సత్తెమ్మతల్లి గుడి సమీపంలో నివాస గృహాలు, షాపులు మీద మంగళవారం అర్థ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలు తో దాడి చేసి, నివాసం వుంటున్న ఇండ్లను జేసీబీ (క్రేన్ )లతో నేల మట్టం చేశారు. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఒక్కసారిగా సుమారు 50 మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి, గంటన్నర పాటు బీభత్సవం సృష్టించారు. ఇంట్లో, షాపుల్లో నిద్రిస్తున్న వారిని బయటకు లాక్కొచి తాళ్ళు తో చేతులు, కాళ్ళు బందించారు. అరిస్తే చంపేస్తామని నోట్లో కత్తులు, రాడ్లు పెట్టి బెదిరించారు. మొత్తం 8 షాపులను, ఇళ్లను, ఇంట్లో సామాగ్రిని క్రేన్ తో ధ్వంసం చేశారు. ముందుగా నివాసితులు దగ్గర వున్న ఫోన్ లను లాక్కొని, వారిని ఊరికి దూరంగా తీసుకెళ్లి ఇష్టానుసారం కొట్టారు. ఎవరికైనా చెపితే చంపుతామని బెదిరించారని నివాసితులు వులవకాయల సాంబయ్య, అర్జున్, అరుసుల నాగేశ్వరావు, ఏసుబాబు వాపోయారు. కాళ్ళు పట్టుకుని బ్రతిమాలిన కనికరించలేదని శ్రీను, ఇసరపు రామకృష్ణ, కండవల్లి ప్రకాష్ బోరుమన్నారు. కష్టపడి కట్టుకున్న ఇళ్ళు నేలమట్టం చేశారని అన్నారు.
కనిపించని హైవే మొబైల్ వాన్..
నిత్యం జాతీయ రహదారిపై పహారా కాసే హైవే మొబైల్ వాహనం సంఘటన జరిగిన సమయంలో అటువైపు రాలేదని, పెట్రోలింగ్ వాహనం కూడా అటుగా రాకపోవడంపై బాధితులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరిగిన తర్వాత 100నెంబర్ కు కాల్ చేసినా ఎవరు తమ వద్దకు రాలేదని భాదితులు వాపోతున్నారు. విధ్వంసానికి పది నిముషాలు ముందు విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారని భాదితులు చెబుతున్నారు. దుండగులను శిక్షించి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని భాదితులు కోరుతున్నారు. సంఘటన స్థలం ను పిఠాపురం సీఐ శ్రీనివాస్, గొల్లప్రోలు ఎస్సై వినయ్ ప్రతాప్, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పరిశీలించారు. భాదితులు నుంచి వివరాలు సేకరించారు. ఎవరూ భయపడవద్దని, దాడికి దిగిన వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే దీని వెనుక ఎవరున్నారు? అసలు ఏం జరిగింది? అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.