సిరా న్యూస్, పెంబి:
పెంబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నీటి కటకట…
+ కనీసం టాయిలెట్లలో కూడా నీళ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న రోగులు
+ పట్టించుకోని అధికారులు
పెంబి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత రెండు నెలల నుండి నీరు అందించే బోరు చెడిపోవడంతో నీళ్ళు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం టాయిలెట్లలో కూడా నీళ్లు రాకపోవడంతో రోగులు సహాయకులు, ఆసుపత్రి సిబ్బంది సైతం అవస్థలు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు మంచికంటి లక్ష్మణ్ ఆసుపత్రికి చేరుకొని, నీటి కొరత గురించి అధికారులను ప్రశ్నించగా, ఆసుపత్రి సిబ్బంది శివ కుమార్ దురుసుగా ప్రవర్తించారు. మా ఆసుపత్రిలో నీళ్లు లేకపోతే మీకేం సంబంధం అని, ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని అన్నారు. అయితే ఆసుపత్రి ప్రాంగణం లో నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణానికి ఆసుపత్రి బోరునే వాడడంతో, అది చెడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. నూతన భవనం కోసం కాంట్రాక్టర్ నీటి సదుపాయం ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నప్పటికీ, ఆసుపత్రి బోరునే ఉపయోగించడంతో ప్రస్తుతం అది చెడిపోయిందని ప్రజలు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి బోరు కు మరమ్మతులు చేయించి, నీటి వసతి పునరుద్ధరించాలని మండల వాసులు కోరుతున్నారు.