విశాఖలో ఆ ముగ్గురు అవుట్?

సిరా న్యూస్,విశాఖపట్టణం;
విశాఖ జిల్లా పై జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అక్కడ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బలమైన అభ్యర్థులను బరిలోదించాలని చూస్తున్నారు. జిల్లాలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు జనసేనలో చేరారు. తాజాగా ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సైతం అదే పని చేశారు. ఇది ఒక రకంగా వైసిపికి షాకింగ్ పరిణామమే. అందుకే వచ్చే ఎన్నికల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ చూస్తున్నారు. భారీగా అభ్యర్థుల మార్పునకు శ్రీకారం చుడతారని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లోనే ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ముగ్గురు సిట్టింగులకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి మార్పు తప్పదని ప్రచారం జరుగుతోంది.విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు లకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. దీంతో వారు బయలుదేరి వెళ్లారు. దీంతో రకరకాల చర్చ జరుగుతోంది. ఈ ముగ్గురు నియోజకవర్గాల్లో ఏమైనా మార్పులు ఉంటాయా? స్థాన చలనం ఉంటుందా? లేకుంటే పక్కన పడేస్తారా? అన్న టాక్ నడుస్తోంది. ఈ మూడు చోట్ల పార్టీ బలహీనంగా ఉన్నట్లు సర్వే నివేదికలు తేల్చి చెబుతున్నాయి. ముగ్గురు సిట్టింగులపై ప్రతికూల ఫలితాలు వచ్చినట్లు తేలడంతో.. జగన్ వారిని పిలిపించి మాట్లాడినట్లు తెలుస్తోంది.ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి టిడిపి తరఫున పోటీ చేసిన వాసుపల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల అనంతరం వైసీపీలోకి ఫిరాయించారు. అప్పట్లో టికెట్ హామీతోనే పార్టీలో చేర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన పనితీరుపై వైసీపీలో పెద్దగా సంతృప్తి కనిపించడం లేదు. అందుకే ఆయనను పక్కన పెడతారని.. ఆయన స్థానంలో కోలా గురువులు కానీ.. సీతం రాజు సుధాకర్ కానీ పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది.ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కి ఈసారి స్థానచలనం తప్పదని టాక్ నడుస్తోంది. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. అనకాపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలో కాపుల సంఖ్య అధికం. అందుకే ఈసారి ఆయన ఎంపీగా పోటీ చేయించి.. చోడవరం అసెంబ్లీ స్థానానికి కొత్త అభ్యర్థిని తెస్తారని టాక్ నడుస్తోంది. అయితే ఎంపీగా పోటీ చేయడానికి ధర్మ శ్రీ విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది.పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు సైతం తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన పనితీరుపై వైసీపీలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. నాలుగు మండలాల్లో సొంత పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే చంగల వెంకట్రావుకు ఇసారెడ్డి టికెట్ ఖాయమని ప్రచారం జరుగుతోంది. మరోవైపు బాబురావును రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేస్తారని కూడా ఒక టాక్ నడుస్తోంది. మొత్తానికైతే విశాఖలో పెను మార్పులకు జగన్ శ్రీకారం చుట్టారు. వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *