రబీ సాగుకు ఎదురు దెబ్బ..

సిరా న్యూస్,ఏలూరు;
ఖరీఫ్‌ మాసూళ్లు ఎప్పటికీ పూర్తయ్యేనో.. దాళ్వా నారుమడులు పూర్తయ్యేదెప్పుడో.. ఇంకా పొలాల్లో ఉన్న 60 శాతం పంట గట్టెక్కేదెప్పుడో.. నాట్లు ఆలస్యమైతే దాళ్వా సాగు సాగేనా.. ఇలా రైతులను అనేక ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మిచౌంగ్‌ తుపాను దెబ్బకు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తడిసిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకుండా వ్యవహరిస్తున్న తీరు దాళ్వాసాగుపై తీవ్ర ప్రభావం చూపనుండటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తడిసిన ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాళ్వా సాగుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జిల్లా రైతాంగం ఆశలను మిచౌంగ్‌ తుపాను తుడిచేసింది. ఖరీఫ్‌ పంట మాసూళ్లు పూర్తిచేసి దాళ్వా నారుమడులు వేసేందుకు తీవ్ర ఆలస్యమయ్యే పరిస్థితి ఉంది. దీంతో ఇటు ఖరీఫ్‌ పంట పోయే.. అటు దాళ్వా పంట ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో అన్నదాత కొట్టుమిట్టాడుతున్నాడు. తడిసిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయలేదు. దీంతో రైతులు తడిసిన ధాన్యం ఆరబెట్టడంలోనే రోజులు గడిచిపోతున్నాయి. దీంతో రబీ నారుమడులపై దృష్టి సారించే పరిస్థితి లేకుండాపోయింది. రెండు జిల్లాలవ్యాప్తంగా ఖరీఫ్‌లో నాలుగు లక్షల ఎకరాల్లో వరిసాగు సాగింది. ఏలూరు జిల్లాలో 45 శాతం మాసూళ్లు పూర్తవ్వగా, పశ్చిమగోదావరి జిల్లాలో 35 శాతం మాసూళ్లు మాత్రమే పూర్తయ్యాయి. సరాసరిన 40 శాతం మాసూళ్లు పూర్తవ్వగా, దాదాపు 2.50 లక్షల ఎకరాల్లో పంటంతా పొలాల్లోనే ఉంది. మిచౌంగ్‌ తుపాను భీభత్సంతో రైతుల బతుకులు అల్లకల్లోలంగా మారాయి. తుపాను ప్రభావంతో రెండు రోజులపాటు ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షంతో పొలాల్లో మోకాళ్ల లోతుకుపైగా వరదనీరు నిలిచిపోయింది. దీంతో మాసూలు చేసిన రాశులన్నీ నీట మునిగాయి. కోత కోయాల్సిన పొలాలు నేలకొరిగి నీటిలో నాని కుళ్లిపోతున్న పరిస్థితి నెలకొంది. రబీలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4.60 లక్షల ఎకరాల్లో సాగు చేసేందుకు జిల్లా సాగునీటి సలహామండలి సమావేశంలో నిర్ణయించారు. సకాలంలో రబీ నాట్లు పూర్తి కావాలంటే డిసెంబర్‌ 15వ తేదీకి రబీ నారుమడులు పూర్తి చేయాలని తెలిపారు. ఇప్పట్లో రైతులు నారుమడులు వేసే పరిస్థితి లేకుండాపోయింది. అందుకు ప్రధాన కారణం ప్రభుత్వమేనని చెప్పాలి. తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తే రైతులు వేగంగా ఖరీఫ్‌ మాసూళ్లు పూర్తి చేసేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వం మాత్రం మాటలకే పరిమితమై రైతులను వంచిస్తోంది. పొలాల్లో నీరు తగ్గి ఖరీఫ్‌ మాసూళ్లు పూర్తి చేయాలంటే మరో 20 రోజులకుపైగా సమయం పట్టే పరిస్థితి ఉంది. అంటే డిసెంబర్‌ నెలాఖరుకు కూడా నారుమడులు పూర్తయ్యే అవకాశం కన్పించడం లేదు. నిడమర్రు, ఉంగుటూరు వంటి పలు మండలాల్లో కొల్లేరుకు ఆనుకుని ఉన్న పొలాలకు రైతులు నారుమడులు వేశారు. తుపాను దెబ్బకు పెద్దఎత్తున నీరు నిలిచిపోవడంతో నారుమడులు పనికిరాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితి చూస్తే దాళ్వా నాట్లు ఫిబ్రవరి వరకూ పూర్తయ్యే పరిస్థితి కన్పించడం లేదు. అదే జరిగితే సాగునీటి సమస్య ఏవిధంగా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఇది రబీ పంటపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. దీంతో ఇటు ఖరీఫ్‌, అటు రబీలోనూ రైతులు నష్టాలు పాలైతే అప్పుల ఊబిలో కూరుకుపోతారు. ఖరీఫ్‌ మాసూళ్లు త్వరగా పూర్తికావాలంటే ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో నిబంధనలు సడలించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *