సిరా న్యూస్,తాండూరు;
బతుకు దెరువు కోసం వచ్చిన కూలీ కుటుంబంలో రోడ్డు దుర్మరణం విషాదం నింపింది. ఈ సంఘటన శనివారం ఉదయం తాండూరు మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, కరణ్ కోట్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపూర్ జిల్లా గుత్తి మండలం అనగాని దొడ్డికి చెందిన మదం హన్మంతు, వరలక్ష్మీలు కుటుంబంతో కలిసి తాండూరు మండలానికి వలస వచ్చారు. గోపన్ పల్లి సమీపంలోని ఒక వ్యాపారి పాలిషింగ్ యూనిట్లో కూలీలుగా పనిచేస్తున్నారు. శనివారం ఉదయం హన్మంతు తన తన కూతురు, కుమారుడు మధం జనార్ధన్(8)ను తాండూరు పట్టణంలోని విజయ విద్యాలయ పాఠశాలలో వదిలేందుకు బైకుపై బయల్దేరాడు.
గ్రామ సమీపంలోకి రాగానే బైకును లారీ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ క్రమంలో కిందపడిన జనార్దన్ తల నుజ్జు నుజ్జయ్యింది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కళ్ల ముందే కుమారుడు మరణించడంతో తల్లీదండ్రులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న కరన్ కోట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు.
=================