సిరా న్యూస్,ఖమ్మం;
పాఠశాలలు పునఃప్రారంభం నాటికి ఏకరూప దుస్తులు అందించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. నేడు కలెక్టర్, ఖమ్మం రూరల్ మండలం, జలగం నగర్ లోని మహిళా శక్తి కుట్టు కేంద్రాన్ని సందర్శించి, ఏకరూప దుస్తుల తయారీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏకరూప దుస్తుల అందజేతకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 2,48,837 మంది విద్యార్థులు ఉండగా, ఇందులో 1,15,990 మంది బాలురు, 1,32,857 మంది బాలికలు ఉన్నట్లు ఆయన అన్నారు. 1,185 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులను గుర్తించి, ఏకరూప దుస్తుల తయారీకి చర్యలు చేపట్టినట్లు ఆయన అన్నారు. విద్యార్థుల వారిగా కొలతలు తీసుకొని, మహిళా శక్తి కుట్టు కేంద్రాలకు తయారీకి అప్పజెప్పినట్లు ఆయన అన్నారు. జలగం నగర్ మహిళా కుట్టు కేంద్రం లో 19 కుట్టు మిషన్లు ఉండగా, కటింగ్ మిషన్, కాజా మిషన్, బటన్ మిషన్ లు సమకూర్చినట్లు ఆయన అన్నారు. మిషన్ల ఆపరేటింగ్ నేర్చుకొని, మరికొందరికి నేర్పాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఏకరూప దుస్తులు అందడంతో పాటు, స్వయం సహాయక సంఘాల వారికి ఉపాధికల్పన జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సందర్శన సందర్భంగా కలెక్టర్ స్వయం సహాయక సంఘ సభ్యులతో మాట్లాడారు. సంఘ సభ్యులు మహిళలు ఆర్థికంగా నిలద్రొక్కుకొనే విధంగా ప్రభుత్వం ఆసరా ఇస్తున్నదని అన్నారు. మహిళా సంఘాలకు ఏకరూప దుస్తుల ఆర్డర్ ఇవ్వడమే కాక, కటింగ్, కాజా, బటన్ మిషన్ల కొనుగోలుకు ప్రభుత్వం తోడ్పాటు ఇచ్చిందని, ఇది ఎంతో సంతోషకరమని అన్నారు. ప్రభుత్వ తోడ్పాటుతో ఆర్థికంగా ఎదిగి, సమాజంలో గౌరవంగా జీవనం సాగిస్తామని తెలిపారు.
=====================