బ్రహ్మంగారి కాలజ్ఞానంపై చర్చ

సిరా న్యూస్,విజయవాడ;

ఐదు రోజులుగా తెలుగు రాష్ట్రాలు వర్షాలకు అతలాకుతలం అవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో మూడు రోజులు రెండు రాష్ట్రాల్లో కుంభవృష్టి కురిసింది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలపై వాన ప్రభావం ఎక్కువగా ఉంది. తీవ్ర నష్టం జరిగింది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి. ఇక విజయవాడలో బుడమేరు పొంగడంతో నగరం 40 శాతం నీట మునిగింది. 3 లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. లక్ష ఇళ్లలోకి వరద చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐదు రోజులుగా విజయవాడలోని పలు కాలనీలు నీటిలోనే ఉన్నాయి. మరోవైపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు విజయవాడతోపాటు, తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మంగారి కాలజ్ఞానంపై చర్చ జరుగుతోంది.ఎప్పుడూ లేని స్థాయిలో భారీ వర్షపాతం నమోదు కావడంతో, నదులు ప్రాజెక్టులు నిండిపోయి విజయవాడను నీళ్లతో నింపేసాయి. ముఖ్యంగా బుడమేరు వాగు వెనక్కి ప్రవహిస్తుండడంతో ఆ సమీప ప్రాంతాల్లోని నివాస గృహాలు చాలావరకు ముంపులోనే ఉన్నాయి. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. చుట్టుపక్కల ఉన్న వాగులన్నీ పోటెత్తి విజయవాడ నగరాన్ని ముంచేశాయి. నగరంలో ఎక్కడ చూసినా వరద నీదే దర్శనమిస్తుండడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. విరామం లేకుండా కురుస్తున్న వర్షాలు కూడా సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఇప్పటికే వేలాది మందిని పునరవాస కేంద్రాలకు తరలించి వారికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంకా కొంతమంది ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు.బెజవాడ గతంలో ఎప్పుడు లేని విధంగా ముంపునకు గురవడంతో వీర బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజం అవుతుందా అనే చర్చ మొదలైంది. పోతులూరి వీరబ్రహ్మం స్వామి చెప్పినట్లుగా ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ముక్కుపుడకను వరదనీరు తాకుతుందని కాలజ్ఞానంలో ప్రస్తావించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు వరదలను చూస్తుంటే.. అదే నిజమయ్యేట్టు ఉందనే చర్చ జనాల్లో మొదలైంది. ప్రకాశం బ్యారేజీకి 10 లక్షల క్యూసెక్కులకుపైగా వరద వస్తుండడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో అన్న చర్చ జరుగుతోంది. కరకట్టపై ఉన్న నిర్మాణాలు మునిగిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరకరట్ట తెగితే విజయవాడ మొత్తం తుడిచి పెట్టుకుపోతుందని ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *