ప్రతి కుటుంబాన్ని కవర్ చేస్తూ ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

-5 రోజులలో కుటుంబాల వివరాల సేకరణ పూర్తి చేయాలి

-పిహెచ్ సి లలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

-పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

-ముత్తారం, రామగిరి మండలాలలో పర్యటించిన జిల్లా కలెక్టర్

 సిరా న్యూస్,మంథని;
గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని కవర్ చేస్తూ ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ముత్తారం మండలంలో విస్తృతంగా పర్యటించారు.
ఫ్యామిలీ డిజిటల్ సర్వే పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన ముత్తారం మండలంలోని దర్యాపూర్ గ్రామాన్ని కలెక్టర్ సందర్శించి జరుగుతున్న సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీ చేసేందుకు చేపట్టిన సర్వేలో గ్రామంలోని ప్రతి కుటుంబం వివరాలు పకడ్బందీగా సేకరించాలని, 5 రోజుల వ్యవధిలో కుటుంబ వివరాల సేకరణ పూర్తి చేయాలని, అక్టోబర్ 9న సేకరించిన వివరాల స్క్రూటినీ చేసి , అక్టోబర్ 10న ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు సంబంధించి సమాచారంతో కూడిన నివేదిక సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.
అనంతరం ముత్తారం మండల తహసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు, పెండింగ్ భూ సమస్యల వివరాలు తెలుసుకున్న కలెక్టర్ వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ముత్తారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని అన్నారు.
అనంతరం రామగిరి మండలంలోని బేగంపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఔట్ పేషెంట్ విభాగం ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, మందుల పంపిణీ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎన్.సి.డి సర్వే అమలు అవుతున్న తీరు , ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాల వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అవసరమైన మేర మందుల స్టాక్ అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. రోగులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ తనిఖీలలో ముత్తారం తహసిల్దార్ సుమన్, ఎంపీడీవో సురేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *