సిరా న్యూస్,తిరుపతి;
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా కాకముందే ఆ పార్టీ ఎమ్మెల్యేలు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇసుక దందాపై ధర్మవరం టీడీపీ నేత జేపీ ప్రభాకర్‌రెడ్డి సొంత పార్టీ నేతలపైనే ఆరోపణలు చేశారు. ఇక అనేక అక్రమాలకు ప్పాడుతున్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. తాజాగా టీడీపీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. ఆదిమూలం తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ లైంగిక వేధింపుల ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన టీడీపీ అధిష్ఠానం ఆయనపై చర్యలకు ఉపక్రమించింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మహిళపై అసభ్యంగా ప్రవర్తించినందుకు పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు.ఇదిలా ఉంటే.. ఆదిమూలం సత్యవేడు నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మిపైనే లైంగికదాడి చేసినట్లు బాధితురాలే తెలిపింది. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించారని ఆరోపించింది. ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలనే తాను పెన్ కెమెరాలో వీడియో తీశానని వెల్లడించింది. తనవద్ద బలమైన సాక్ష్యాలున్నాయనే ఆయన తనకు అనేకమార్లు ఫోన్లుచేశారని.. రాత్రిపూట మెసేజ్‌లు పెట్టి బెదిరిస్తున్నారని.. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో ఆమె మీడియా సమక్షంలో వెల్లడించారు. ఇదే విషయమై పార్టీ అధినేత సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు, మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ విషయాలన్నీ విధిలేని పరిస్థితుల్లో వెల్లడించాల్సి వస్తోందన్నారు.ఇద్దరం ఒకే పార్టీకి చెందిన వారం కావడంతో పార్టీ కార్యక్రమాల్లో ఇద్దరం పాల్గొనే వారం. కొద్దిరోజులకు నా ఫోన్ నెంబర్ తీసుకుని పదేపదే ఫోన్లు చేయడం ప్రారంభించారని తెలిపింది. ఎన్నికలు ముగిసే వరకూ నన్ను సోదరిగా సంభోదించారు. ఆ తర్వాత ఆయన తన నిజస్వరూపం బయటపెట్టారని పేర్కొంది. ఆయనతో సన్నిహితంగా ఉండాలంటూ బెదిరింపులకు దిగారు. తమ మాట వినకపోతే భర్త, ఇద్దరు పిల్లల్ని చంపేస్తానని, పార్టీ పరంగా ఎలాంటి లబ్ది చేకూరకుండా చేస్తాననే వారు అని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలతో పార్టీ అతనిపై చర్య తీసుకుంది.ఇదిలా ఉంటే సస్పెన్షన్ వేటు పడ్డ ఆదిమూలం తీవ్ర మానసిక ఒత్తడికి లోనయ్యారు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వైద్యులు స్టంట్ వేసినట్లు తెలుస్తోంది. ఆదిమూలం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం.
వైసీపీ హై కమాండ్ మౌనమే
ఏపీలో నేతల వ్యక్తిగత వ్యవహార శైలి వివాదాస్పదం అవుతోంది. ముఖ్యంగా కుటుంబ, వివాహేతర సంబంధాలు, వివాదాలు బయటపడుతున్నాయి. నిన్నటి వరకు వైసిపి నేతల వ్యవహార శైలి బయటపడింది. కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో విజయసాయి రెడ్డి వ్యవహారం బయటకు వచ్చింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మీడియా ముందుకు వచ్చారు. తన భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అంటూ ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి పై అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు విజయసాయిరెడ్డి. ఇదంతా మీడియా కుట్రగా అభివర్ణించారు. ఆ ఎపిసోడ్ ముగియగానే ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారం బయటపడింది. మాధురి అనే మహిళతో సన్నిహితంగా ఉంటూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, ఇద్దరు పిల్లలు ఆరోపించారు. దువ్వాడ నివాసం వద్ద పక్షం రోజుల పాటు ధర్నా చేశారు. రోజుకో ట్విస్ట్ తో ఈ వివాదం నడిచింది. ఇది మరువకముందే ఎమ్మెల్సీ అనంత బాబు వీడియో కాల్ లో అసభ్యకర ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయాల్లో వైసిపి హై కమాండ్ పెద్దగా పట్టించుకోలేదు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేయడం, క్యాడర్ నుంచి కూడా విన్నపం రావడంతో వైసిపి అతనిపై చర్యలకు ఉపక్రమించింది. అయితే కేవలం ఇంచార్జ్ పదవి నుంచి మాత్రమే తప్పించింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. అటు అనంత్ బాబు విషయంలో కూడా అదే జరిగింది. వైసీపీ హై కమాండ్ మౌనమే దాల్చింది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలకు కీలక సూచనలు ఇచ్చారు. ప్రజలునమ్మకంతో బాధ్యత అప్పగించారని.. దానిని నిలబెట్టుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత మనపై ఉందని ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు. అటు పవన్ సైతం చాలా రకాలుగా జాగ్రత్తలు చెప్పారు. వైసీపీ నేతల మాదిరిగా వ్యవహరించవద్దని కూడా సూచించారు. అయితే ప్రతి పార్టీలో ఇటువంటి పరిస్థితులు తలెత్తడం సహజం. అందరూ వ్యక్తిగత వ్యవహార శైలిని పరిగణలోకి తీసుకోలేం కాబట్టి.. ఆరోపణలు వచ్చిన వెంటనే ఏ పార్టీ అయినా విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. కానీ ఈ విషయంలో జగన్ వెనుకడుగు వేశారు. చంద్రబాబు ముందంజ వేశారు.