సిరా న్యూస్,విజయవాడ
పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ లో కీలక ఘట్టం ముగిసింది. రెండో సొరంగం తవ్వకం పనులు పూర్తయ్యాయి. టన్నెల్ బోరింగ్ మెషిన్ ద్వారా రెండు టన్నెల్స్ నిర్మాణాన్ని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) పూర్తి చేసింది. ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఈ ప్రాజెక్ట్ టన్నెల్స్ తవ్వకం 15 ఏళ్ల కిందట ప్రారంభమైంది. 2020లో తొలి టన్నెల్ లో 3. 6 కిలోమీటర్లు, రెండో టన్నెల్ లో ఏడున్నర కిలోమీటర్ల పనులు చేపట్టిన ఎంఈఐఎల్ విజయవంతంగా పూర్తి చేసింది. టన్నెల్స్ తవ్వకాన్ని పూర్తి చేసిన అధికారులు, కాంట్రాక్టు సంస్థ, సిబ్బందిని ప్రభుత్వం అభినందించింది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ తొలి టన్నెల్ ను 2021 జనవరి నెలలో పూర్తి చేసింది. 13 నెలల్లోనే మూడున్న కిలోమీటర్ల తవ్వకం పనులు పూర్తి చేసి ఈ టన్నెల్ ను పూర్తి చేసింది. తొలి టన్నెల్ పనులు ప్రారంభమైన 12 సంవత్సరాల తరువాత అతిపెద్ద విషయం ఇది. రెండో టన్నెల్ లో ఏడున్నర కిలోమీటర్ల తవ్వకం పనులను టి బి ఎం ద్వారా ఆ సంస్థ మంగళవారం పూర్తి చేసింది. ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని కొత్తూరు నుంచి నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ప్రాజెక్ట్ ఎగువ భాగంలోని కొల్లం వాగు వరకు రెండు టన్నెల్స్ తవ్వకం పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జల వనరుల శాఖ చేపట్టింది. తొలి టన్నెల్ ఏడు డయా మీటర్ల వ్యాసార్ధంతో, రెండో టన్నెల్ 9.2 డయా మీటర్ల వ్యాసార్ధంతో తవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో టన్నెల్ పొడవు 18. 82 కిలోమీటర్లు. తొలి టన్నెల్ నుంచి మూడు వేల క్యూసెక్కులు, రెండో టన్నెల్ నుంచి 8500 క్యూసెక్కులు చొప్పున్ రోజుకు ఒక టీఎంసీ నీటిని తరలించేలా వీటిని డిజైన్ చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక రెండో టన్నెల్స్ పనులను మేఘా సంస్థ చేపట్టింది. తొలి టన్నెల్ పనులు చేపట్టిన 13 నెలల కాలంలో మిగిలిన 3. 6 కిలోమీటర్ల తవ్వకాన్ని సంస్థ పూర్తి చేసి బ్రేక్ త్రూ సాధించింది. ఈ టన్నెల్స్ పూర్తి అయ్యి శ్రీశైలం జలాశయం నుంచి నీటి తరలింపు ప్రారంభమైతే ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంతో పాటు, నెల్లూరు, కడప జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ప్రకాశం జిల్లాలో 3. 5 లక్షల ఎకరాలు, నెల్లూరు లో 80 వేల ఎకరాలు, కడప జిల్లాలో 30 వేల ఎకరాలకు సాగునీరు వెలుగొండ ప్రాజెక్ట్ వల్ల లభిస్తుంది.