– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
సిరా న్యూస్;
ఏపీకి మిచౌంగ్ తుఫాన్ ముప్పు పొంచి ఉందని విపత్తుల సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, సహాయకచర్యల్లో టిడిపి నేతలు-కార్యకర్తలు పాల్గొనాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మిచౌంగ్ తుఫాన్ తీవ్రత దృష్ట్యా యువగళం పాదయాత్రకి విరామం ప్రకటించానని తెలిపారు. విపత్తుల సంస్థ జారీ చేసే హెచ్చరికలు ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సురక్షిత ప్రదేశాలలో ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని కోరారు. అత్యవసర పరిస్థితులలో ఉపయోగపడేలా మొబైల్ ఫోన్లు చార్జింగ్ ఉంచుకోవాలని, శిథిల భవనాలలో అస్సలు ఉండొద్దని హెచ్చరించారు. టిడిపి కేడర్ స్వచ్ఛందంగా తుఫాన్ సహాయక చర్యలు చేపట్టాలని, ప్రజలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.