రెచ్చిపోతున్న మెడికల్ మాఫియా

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది. కొంత మంది కేటుగాళ్లు రక్తంతో చెలగాటం ఆడుతున్నారు. బ్లాక్ మార్కెట్ లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ప్లాస్మాను అక్రమంగా కొనుగోలు చేసి లక్షలు సంపాదిస్తున్నారు. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మెడికల్ మాఫియా పై ఉక్కు పాదం మోపుతున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. హైదరాబాద్‌లో అడ్డగోలుగా జరుగుతున్న హ్యూమన్ ప్లాస్మా దందాకు డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు చెక్ పెట్టారు. గత కొన్నేళ్ల నుండి గుట్టుచప్పుడు కాకుండా మూసాపేట్ లో హీమో సర్విస్‌ ల్యాబోరేటరీస్‌లో డీసీఏ తనిఖీలు నిర్వహించి భారీగా హిమాన్ ప్లాస్మా బ్యాగుల గుర్తించి, సీరం సైతం నిల్వలను సీజ్ చేశారు. ఒక యూనిట్‌ రూ.700కు కొని, రూ.3,800కు ముఠా అమ్ముతున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా మానవ రక్తం, ప్లాస్మా, సీరం నిల్వచేస్తున్న ఓ ఇంటిపై డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు నిర్వహించారు. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో వాటిని నిల్వచేస్తున్నట్టు గుర్తించారు. 2016 నుంచి కొనసాగుతున్న ఈ దందాకు సంబంధించి పలు కీలక వివరాలు సేకరించారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని వారికి మానవ రక్తం, ప్లాస్మా, సీరం అక్రమంగా విక్రయిస్తున్నట్టు ఆధారాలు లభించాయి.అయితే డీసీఏ అధికారులు తనిఖీల చేసిన క్రమంలో విస్తుపోయే నిజాలను చూశారు. మూసాపేట్‌ భవానీనగర్‌లోని ఓ రెసిడెన్షియల్‌ భవనంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న హేమో సర్విస్‌ ల్యాబోరేటరీస్‌ లో సోదాలు చేపట్టారు. భారీగా హ్యూమన్‌ ప్లాస్మా బ్యాగులను గుర్తించారు. అదే ఆవరణలో ఉన్న ఫ్రీజర్‌లలో సీసాల్లో నిల్వ చేసిన సీరం, మానవ రక్తం గుర్తించారు. ఆర్‌.రాఘవేంద్ర నాయక్‌ దీనిని నడుపుతున్నట్టు గుర్తించారు. రాఘవేంద్ర నాయక్‌ అనే వ్యక్తి స్వతహాగా ఫార్మసీ బ్యాక్ గ్రౌండ్ కలిగిన వ్యక్తి కావడంతో రక్తానికి సంబంధించిన అవగాహన ఉంది. గత ఎనిమిదేళ్లుగా ప్లాస్మాను వివిధ బ్లడ్ సెంటర్ లో నుండి సేకరిస్తున్నట్టు గుర్తించారు. అనధికారిక పద్ధతుత్లో వివిధ బ్లడ్‌ బ్యాంక్‌ల నుంచి రక్తం సేకరించి, దాన్నుంచి ప్లాస్మా, సీరం తీసి రీ ప్యాకింగ్‌ చేసి విక్రయిస్తున్నట్టు తెలిసింది. రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లో ఉన్న శ్రీకర హాస్పిటల్‌ బ్లడ్‌ బ్యాంక్, దారు ఉల్‌ షిఫాలోని అబిద్‌ అలీఖాన్‌ లయన్స్‌ ఐ హాస్పిటల్లో ఉన్న న్యూ లైఫ్‌ బ్లడ్‌ సెంటర్, కర్నూలు జిల్లా ధర్మపేటలోని భాగ్యనగర్‌లో ఉన్న ఆర్‌ఆర్‌ హాస్పిటల్‌ బ్లడ్‌ బ్యాంకు నుంచి అక్రమంగా రక్తం సేకరిస్తున్నట్టు డీసీఏ అధికారుల వద్ద రాఘవేంద్ర నాయక్‌ అంగీకరించారు. తెలంగాణ, ఏపీలోని పలు బ్లడ్‌ బ్యాంకుల నుంచి ఒక్కో యూనిట్‌ రక్తాన్ని 700 రూపాయలకు కొనుగోలు చేసి 3,800 వరకు విక్రయిస్తున్నట్టు కనుగొన్నారు. ఇలా రాఘవేంద్ర 2016 నుంచి ఆరువేల యూనిట్లకుపైగా రక్తాన్ని అక్రమంగా సేకరించి ప్లాస్మా, సీరం విక్రయించినట్టు డీసీఏ అధికారులు గుర్తించారు. విశాఖపట్నంలోని ఆక్టిమస్‌ బయోసైన్స్, హైదరాబాద్‌ ఐడీఏ బొల్లారంలోని క్లియాన్స్‌ ల్యాబ్స్, పుణేలోని క్లినోవి రీసెర్స్‌ ప్రై.లిమిటెడ్, బెంగళూరులోని జీ7 సినర్జీస్‌ ప్రై.లిమిటెడ్, మైక్రో ల్యాబ్స్, నార్విచ్‌ క్లినికల్‌ సర్విసెస్‌ ప్రై.లిమిటెడ్, ఐడీఏ మల్లాపూర్‌లోని శిల్పా మెడికా లిమిటెడ్, మదీనగూడలోని జెన్‌రైస్‌ క్లినికల్‌ ప్రై.లిమిటెడ్, చర్లపల్లిలోని విమ్‌టా ల్యాబ్స్‌ లిమిటెడ్‌లకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాల్లో భాగంగా హెచ్‌ఐవీ, ఇతర టెస్టింగ్‌ కిట్‌లు, పలు డాక్యుమెంట్లు స్వాదీనం చేసుకున్నరు. ఇల్లీగల్ గా డ్రగ్ మెయింటైన్ చేస్తున్న వారిపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ పూర్తి స్థాయి నిఘా ఉందని డ్రగ్ సంబంధించి పర్మిషన్ తీసుకొని నిల్వ ఉంచాలని, లీగల్ గా మెయింటైన్ చేయాలని, లేకుంటే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్ కంట్రోల్ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *