కొలికపూడికి షాక్ తప్పదా…

సిరా న్యూస్,విజయవాడ;
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి టిడిపికి తలనొప్పిగా మారుతోంది.అమరావతి ఉద్యమ నేపథ్యమున్న ఆయనకు పిలిచి మరి చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు.విజయవాడ ఎంపీగా పోటీ చేసిన కేశినేని చిన్నిసిఫారసు మేరకు కొలికపూడికి అవకాశం కల్పించారు. ఆయనకు టిడిపి అనుకూల మీడియాకు చెందిన ఓ అధిపతి ఆశీస్సులు ఉన్నట్లు కూడా అప్పట్లో ప్రచారం సాగింది. అయితే ఆయన దూకుడు ఎన్నికల నుంచే ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెడుతోంది. కూటమి ప్రభంజనంలో తిరువూరు నుంచి గెలిచారు కొలికపూడి. కానీ గెలిచిన తర్వాత ఆయన తీరు మారింది. రోజుకో వివాదంలో చిక్కుకుంటున్నారు. పార్టీకి తలవంపులు తెస్తున్నారు. దీంతో కొలికపూడి విషయంలో ఏదో ఒకటి తేల్చుకోవాలన్న పరిస్థితికి టిడిపి హై కమాండ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆయనకు షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఓ సర్పంచ్ పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందుకు మనస్థాపానికి గురైన ఆయన భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. డ్వాక్రా మహిళల విషయంలో సైతం అదే దూకుడు ప్రదర్శించారు. వారిని గంటల తరబడి పోలీస్ స్టేషన్లో ఉంచేలా ఆదేశాలు ఇచ్చారు. అటు తరువాత మహిళల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా రైతులను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రత్యర్థులకు టార్గెట్ అవుతున్నాయి. ఆయన తీరుతో టిడిపి ప్రతిష్ట మొదలైంది. దీనికి తోడు దీక్షలు, ర్యాలీల పేరుతో కొలికపూడి హంగామా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. హై కమాండ్ కు ఫిర్యాదులు వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇటీవల తిరువూరు టిడిపి శ్రేణులు విజయవాడలో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసి వినతి పత్రం అందించాయి. మంత్రి అచ్చెనాయుడును కలిసి సమస్యలను విన్నవించాయి. దీంతో వారు చంద్రబాబుకు నివేదిక ఇచ్చారు. చంద్రబాబు ఎమ్మెల్యే కొలికపూడిని పిలిచి మాట్లాడారు. కీలక సూచనలు చేశారు. ఇటువంటివి మరోసారి పునరావృతం అయితే కఠిన చర్యలకు దిగుతామని హెచ్చరించారు. అయినా సరే ఆయనలో మార్పు రావడం లేదు. రోజురోజుకు పరిస్థితి శృతిమిస్తుండడంతో టిడిపి హై కమాండ్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురయింది.తాజా వివాదాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తిరువూరు ఇన్చార్జిగా సీనియర్ నేత శావల దేవదత్ ను నియమిస్తారని ప్రచారం ప్రారంభమైంది. రేపటి నుంచి నియోజకవర్గ పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటానని ఆయన ప్రత్యేక ప్రకటన జారీ చేశారు. ఈరోజు మీడియా సమావేశాన్ని సైతం ఏర్పాటు చేస్తున్నారు. దీంతో దేవదత్ కు హై కమాండ్ సమాచారం ఇచ్చి ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. ప్రోటోకాల్ పదవి ఇచ్చి నియోజకవర్గం బాధ్యతలు చూడాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. ఇప్పటికే అధికార వర్గాలకు సైతం ప్రభుత్వం నుంచి ఒక సమాచారం వచ్చిందని.. ఇకనుంచి దేవదత్ ఆదేశాలను పాటించాలన్నదే ఆ సమాచార సారాంశం. అదే జరిగితే ఎమ్మెల్యే కొలికపూడిడమ్మీగా మారడం ఖాయమన్న ప్రచారం నడుస్తోంది.ఒక ఎమ్మెల్యేగా ఉండగా ఇంచార్జ్ రావడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.అయితే ఉద్యమ నేపథ్యం ఉన్న కొలికపూడి ఈ చర్యలకు ఊరుకుంటారా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఒకవేళ ఆయన తోక జాడిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఖాయమన్న టాక్ నడుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *