ఆర్మూర్ గులాబీలో కలకలం

సిరా న్యూస్,నిజామాబాద్;
నిజామాబాద్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేల తీరుపై.. గులాబీ క్యాడర్ గుస్సాగా ఉన్నారట. పార్టీ కష్టకాలంలో ఉంటే.. నేతలు నియోజకవర్గానికి ముఖం చాటేస్తుండటం పట్ల కార్యకర్తలు గుర్రుగా ఉన్నారట. పార్టీ సీనియర్ మహిళా శాసన సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిపై.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిస్తే.. జిల్లాలో సగానికి పైగా నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు జరగలేదంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో తేటతెల్లమవుతోందని జోరుగా చర్చించుకుంటున్నారట.బాల్కొండ, కామారెడ్డిలో సీఎం దిష్టిబొమ్మలు దగ్దం చేస్తే.. బాన్సువాడ, ఆర్మూర్ లో మొక్కుబడిగా కార్యక్రమం జరిగినట్టు చెబుతున్నారు. ఇక నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గ నేతలు.. కేటీఆర్ ఆదేశాలను లైట్ తీసుకున్నారట. కార్యక్రమాలు చేసేందుకు క్యాడర్ కు సైతం దిశానిర్దేశం చేయలేదట. దీంతో గులాబీ శ్రేణులు తమ నేతల తీరుపై.. చిటపటలాడుతున్నారట.నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పార్టీ దాదాపుగా ఖాళీ అయ్యిందని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. త్వరలో మేయర్ సైతం పార్టీ మారేందుకు సర్వం సిద్దం చేసుకున్నారట. మాజీ ఎమ్మెల్యే బిగాల సైతం వలసలను అడ్డుకోలేకపోతున్నారట. దాంతో అడపాదడపా నియోజకవర్గానికి వస్తూ.. పార్టీ కార్యక్రమాలు మొక్కుబడిగా జరిపిస్తున్నారట. రూరల్ లో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి అనంతరం.. నియోజకవర్గానికి ఎక్కువగా రావడం లేదట. నేతలె పక్కదారి చూస్తుండడంతో.. క్యాడర్ సైతం హస్తం గూటికి క్యూ కట్టారట. ఇక బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారట. ఇప్పటి వరకు నియోజకవర్గంలో అడుగు పెట్టలేదట. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో ఇంచార్జీ బాధ్యతల నుంచి షకీల్ ను తప్పించలని క్యాడర్ కోరుతున్నారట.ఆర్మూర్ లో మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షునిగా ఉన్న జీవన్‌రెడ్డి.. హైదరాబాద్ కు పరిమితం అయ్యారట. ఇప్పటికే ఆర్మూర్ లోనూ ద్వితీయ శ్రేణి నేతలు హస్తం గూటికి చేరారట. అలానే ఎల్లారెడ్డి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యేలు చాలా రోజులుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారట. క్యాడర్ కు అందుబాటులో ఉండకుండా.. నియోజకవర్గానికి ముఖం చాటేశారట. జిల్లాల్లోని నేతలంతా పార్టీకి దూరంగా ఉండడం వెనుక ఏదైనా వ్యూహాం ఉందా అనే టాక్ నడుస్తోందట. నేతలంతా పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నారా ? అన్న చర్చజరుగుతోందట. ఇంచార్జీలుగా ఉన్నా లేనట్లు కాకుండా.. పార్టీ పటిష్టత కోసం అందుబాటులో ఉండాలని క్యాడర్ కోరుతున్నారట.ఒక వైపు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయాలు.. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫాం హౌస్ కే పరిమితమవుతున్నారని విమర్శను మూటగట్టుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎక్కడ కనిపించక పోవడం ఆ వాదనలను మరింత బలపరుస్తున్నాయి. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆరే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ విఫలం అయ్యారని విమర్శలు వస్తున్నాయి. రీసెంట్ గా కేటీఆర్ బావమరిది పాకాల రాజు ఫామ్ హౌస్ పార్టీ ఇష్యూ ఫుల్ హాట్ టాపిక్ అయ్యింది. దీంతో మూలిగే నక్క మీద తాటి పండు పడినట్లుగా.. మాజీలు సైతం ఒక్కొక్కరుగా సైడ్ అవుతుండడం పార్టీ కార్యకర్తలని కలవరపెడుతుందట. ఇప్పటికే వరుస ఓటములతో సతమవుతున్న గులాబీ పార్టీకి.. ఈ వ్యవహారం మరింత తలనొప్పులు తెస్తుందని అభిప్రాయపడుతున్నారట.
మరోవైపు పార్టీ నేతల తీరుపై.. గులాబీ బాస్ అసంతృప్తితో ఉన్నారట. త్వరలో స్ధానిక సంస్ధల ఎన్నికలు రాబోతున్న తరుణంలో.. పార్టీ క్యాడర్ ను యాక్టివ్ చేయాల్సిన లీడర్లు పట్టించుకోకపోవడం పట్ల గుర్రుగా ఉన్నారట. ఈ పరిస్థితుల్లో మాజీల వ్యవహారంలో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారు ? అసలు మాజీలు ఏం చేయాలనుకుంటున్నారని చర్చ ‌ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *