సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి భారతీయ జనతా పార్టీలో సందడి లేదు. పెద్దగా పార్టీ నేతలు ఎవరూ స్పందించడం లేదు. ఫలితాల విషయంలో నిరాశగా ఉన్నారని అందుకే మాట్లాడటం లేదని అనుకోవచ్చు. నిజానికి బీజేపీకి అంత నిరాశజకనమైన ఫలితాలు రాలేదు. తెలంగాణలో ఎనిమిది సీట్లు వచ్చాయి. ఇవి మజ్లిస్ పార్టీ కంటే ఎక్కువ. గత ఎన్నికల్లో ఒక్కటే వచ్చింది. ఈ సారి ఏకంగా 19 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఇవి మరీ తీసి పడేయాల్సిన ఎన్నికలు కావు. కానీ పార్టీ నేతల మధ్య మధ్య మాత్రం ఓ రకమైన ప్రచ్చన్న యుద్ధం జరుగుతోంది. బండి సంజయ , ఈటల రాజేందర్ , కిషన్ రెడ్డిల మధ్య ఏదో జరుగుతోందని బీజేపీ వర్గాలంటున్నాయి. ఈ అంతర్గత పోరాటం అంశం సోషల్ మీడియాకు ఎక్కుతోంది. శాసనసభ ఎన్నికల్లో ఆశించిన స్థాయి సీట్లను గెలుచుకోలేక పోయిన తెలంగాణ బీజేపీకి అంతర్గత సమస్యలు ఇబ్బందికరంగా మారాయి. 2020లో తెలంగాణ బీజేపీ సారథిగా నియమితులైన బండి సంజయ్.. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అనే స్థాయికి తీసుకువచ్చారు. కానీ, ఎన్నికలకు సరిగ్గా నాలుగు నెలల క్రితం ఆయన స్థానంలో కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించింది బీజేపీ అధిష్టానం. అయితే బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడానికి మాజీ మంత్రి ఈటల రాజేందరే కారణమని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. బండి సంజయ్ సారథిగా కొనసాగిఉంటే కాంగ్రెస్ స్థానంలో బీజేపీ ఉండేదన్న సరికొత్త వాదనలు ఆయన అనుచర వర్గం తెరపైకి తీసుకొచ్చింది. మరోవైపు బండి సంజయ్ అనుచరులకు కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఈటల రాజేందర్ అనుచరులు. తన అనుచరులంటూ టికెట్లు ఇప్పించుకున్న వారికి బండి సంజయ్ గెలిపించుకోలేకపోయారని విమర్శిస్తున్నారు. చివరకు తన పార్లమెంట్ పరిధిలోకూడా ఎమ్మెల్యేలను గెలిపించుకోలేకపోయారని సోషల్ మీడియాలో ఈటల అనుచరులు ఫుల్ ఫైర్ అయ్యారు. ఇవి శృతి మించి పోతూండటంతో.. ఈటల రాజేందర్ స్పందించారు. సోషల్ మీడియాలో తన పేరుతో..తన అనుచరుల పేరుతో పెడుతున్న పోస్టులన్నీ ఫేక్ అని ప్రకటించారు. ఈ సోషల్ మీడియా వార్ బండి, ఈటలకు మాత్రమే పరిమితం కాలేదు. తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డిని సైతం వదలడం లేదు. పార్టీ ఓటమికి కారణం ఆయనేనని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీనిని కంట్రోల్ చేయాల్సిన నేతలు మాత్రం మౌనం వహిస్తున్నారు. బండి సంజయ్‌కు మళ్లీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో దానిపై పార్టీ కార్యకర్తలు వెటకారంగా పోస్టులు పెడుతున్నారు. మరోసారి బండిని పార్టీ అధిష్టానం మోసం చేస్తుందని.. అందుకే ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు తీసుకోకూడదని.. కావాలంటే చివరి రెండేళ్లు ఆ బాధ్యతను తీసుకోవాలని సెటైర్లు వేస్తున్నారు. కిషన్ రెడ్డి విషయంలో జరుగుతున్న ప్రచారం మరింత భిన్నంగా ఉంది. ఆయన పై వ్యతిరేకత వచ్చేలా.. జనసేన గురించి ఏదో అన్నారంటూ పోస్టులు పెట్టారు. దీంతో కిషన్ రెడ్డి తాను అలా అనలేదని .. ..తప్పుడు ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాల్సి వచ్చింది.