దేవినేని అవినాష్ కు కలిసి రాని కాలం

సిరా న్యూస్,విజయవాడ;
రాజకీయంగా టీడీపీలో ఓ వెలుగు వెలిగిన అవినాశ్‌… సొంత అవసరాల కోసం వైసీపీకి వెళ్లి.. అక్కడ దూకుడైన రాజకీయంతో టీడీపీకి టార్గెట్‌ అయ్యారంటున్నారు. ముఖ్యంగా టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవినేని అవినాశ్ అరెస్టు ముప్పును ఎదుర్కొంటున్నారు. అవినాశ్‌ను ఎట్టిపరిస్థితుల్లో అరెస్టు చేయాలనే పట్టదలతో ప్రభుత్వ పెద్దలు ఉండటంతో ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అణువణువూ వెతుకుతున్నారు. ఈ కేసులో ఎందరో నిందితులు ఉన్నా… పోలీసులు ప్రధానంగా దేవినేని అవినాశ్ నే టార్గెట్ చేసుకుని వేట కొనసాగించడం వెనుక చాలా పెద్ద కథే ఉందంటున్నారు.హైకోర్టు బెయిల్‌ నిరాకరించడంతో సుప్రీం తలుపు తట్టిన అవినాశ్‌ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీపైన, అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్‌పైన తీవ్ర విమర్శలకు దిగిన ఎందరో నేతలు ఉండగా, అందరికన్నా అవినాశ్‌ టార్గెట్‌ కావడానికి ప్రధాన కారణం టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిలో ఆయన అనుచరులు ఉండటమే.. వాస్తవానికి అవినాశ్‌ కుటుంబానికి టీడీపీకి ఎంతో బంధం ఉంది. అవినాశ్ తండ్రి దేవినేని నెహ్రూ టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. ఇక అవినాశ్ కు సమీప బంధువైన దేవినేని ఉమా టీడీపీలో కీలక నేత. టీడీపీలో దేవినేని నెహ్రూతోపాటు దేవినేని ఉమ, ఈయన సోదరుడు దేవినేని వెంకటరమణ మంత్రులుగా పనిచేశారు.విజయవాడలో టీడీపీ అంటే దేవినేని.. దేవినేని అంటే టీడీపీగా ఉండేది ఒకప్పుడు. ఐతే ముఖ్యమంత్రి చంద్రబాబుతో విభేదించి దేవినేని నెహ్రూ కొన్నాళ్లు కాంగ్రెస్ లో పనిచేసినా.. ఆయన మరణించే ముందు మళ్లీ టీడీపీలోకి తిరిగొచ్చారు. తనతోపాటు కుమారుడు అవినాశ్‌ను టీడీపీలోకి తీసుకువచ్చారు. తండ్రితో కలిసి 2016లో టీడీపీలోకి వచ్చిన దేవినేని అవినాశ్… రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు తీసుకున్నారు. 2019లో మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి పాపులర్ అయ్యారు. ఇలా టీడీపీలో మంచి క్రేజ్ తెచ్చుకున్న దేవినేని అవినాశ్.. ఆ తర్వాత వైసీపీలో చేరి టీడీపీపై ఎవరూ చేయని విమర్శలు చేసేవారు. ఇక ఒకానొక సమయంలో ప్రత్యక్ష దాడులను ప్రోత్సహించే వారని విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో ఏ పార్టీ అయితే ప్రోత్సహించి.. రాజకీయంగా గుర్తింపు ఇచ్చిందో అదే పార్టీకి టార్గెట్ అయ్యారు అవినాశ్.టీడీపీలో చేరకముందు యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన దేవినేని అవినాశ్… 2014 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఐతే ఆ ఎన్నికల్లో బొటాబొటీ ఓట్లు తెచ్చుకున్న అవినాశ్… 2019లో గుడివాడ నుంచి, 2024లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినప్పటికీ… అవినాశ్ మాత్రం వరుస ఓటములతో రాజకీయంగా తీవ్రంగా నష్టపోయారు. ఇదే సమయంలో వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు.కాంగ్రెస్, టీడీపీలో ఉండగా పెద్దగా వివాదాలు లేని అవినాశ్ వైసీపీలోకి వెళ్లిన తర్వాత దూకుడు చూపించారు. దీంతో పలు వివాదాల్లో చిక్కుకున్నారని అంటున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయించారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. ఇవే అవినాశ్‌ కష్టాలకు కారణమయ్యాయంటున్నారు. రాజకీయంగా ఎలాంటి పదవి చేపట్టకపోయినా, కేసుల్లో ఇరుక్కుని అరెస్టు ముప్పు ఎదుర్కొంటున్న అవినాశ్ సొంత పనులపై విదేశాలకు వెళ్లలేని పరిస్థితిని తెచ్చుకున్నారు.హైకోర్టులో కేసు విచారణ దశలో ఉండగా, దుబాయ్ వెళ్లాలనుకున్న అవినాశ్‌ను హైదరాబాద్ విమానాశ్రయంలో అడ్డుకోవడం రాజకీయంగా అవమానకరమే అంటున్నారు. ఏ పార్టీ అయితే తన కుటుంబం రాజకీయానికి పునాది వేసిందో అదే పార్టీకి టార్గెట్ గా మారడం ఒక్క దేవినేని అవినాశ్ విషయంలోనే చూస్తున్నామంటున్నారు పరిశీలకులు.అదే విధంగా టీం లోకేశ్ కోసం అవినాశ్‌ను ఎంతో ప్రోత్సహించింది టీడీపీ… కానీ, వైసీపీలోకి వెళ్లి లోకేశ్ రెడ్‌బుక్‌లో చేరాడు అవినాశ్.. ఇక రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరంటారు. అయితే అవినాశ్ మాత్రం టీడీపీకి శాశ్వత శత్రువుగా ముద్రపడ్డారని చెబుతున్నారు. దీంతో అవినాశ్ రాజకీయ జీవితం వన్ వే ట్రాఫిక్‌లా మారిందంటున్నారు. టీడీపీ వేట నుంచి తప్పించుకోడానికి ఆయన ఏం చేయనున్నారు.. ఈ వివాదం నుంచి బయటపడి రాజకీయంగా ఎలా బలపడతారనేది ఆసక్తి రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *