జగన్ పైనే… గులాబీ ఆశలు

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో ఉద్యమ పార్టీ బిఆర్ఎస్ తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పెద్ద ప్రయత్నాలే చేస్తోంది. కానీ రెండు జాతీయ పార్టీల మధ్య సతమతమవుతోంది. మళ్లీ ప్రజల్లో సెంటిమెంట్ రగిలితే కానీ పార్టీ ఎగసిపడే అవకాశాలు కనిపించడం లేదు. ఏదైనా వివాదాన్ని ఉద్యమం చేయాలంటే.. దాయాది రాష్ట్రంలో అనుకూల ప్రభుత్వం ఉండాలి. ఇప్పటివరకు జగన్ కొనసాగారు. రేపు ఎవరు వస్తారో తెలియని పరిస్థితి. అందుకే జూన్ 4 న ఫలితాల కోసం ఏపీ ప్రజలకంటే.. తెలంగాణలోని బీఆర్ఎస్ నేతలే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఏపీలో జగన్ మరోసారి గెలవాలని ఆశిస్తున్నారు.జూన్ 2 తో ఉమ్మడి రాజధాని నుంచి హైదరాబాద్ కు విముక్తి కలుగుతుంది. విభజన జరిగి 10 ఏళ్ళు అవుతున్న చాలా సమస్యలకు ఇప్పటికీ పరిష్కార మార్గం దక్కలేదు. నీటి వివాదాలు యధాతధంగా ఉన్నాయి. ఒకవేళ ఈ సమస్యలు ఎటువంటి జఠిలం కాకుండా తేలిపోతే ఉద్యమ పార్టీ బిఆర్ఎస్ కు అస్సలు పని ఉండదు. ఆ పార్టీ ఎదిగే ఛాన్స్ ఉండదు. అందుకే వివాదాలు నడవాలంటే ఏపీలో తనకు అనుకూలమైన ప్రభుత్వం రావాలని కెసిఆర్ భావిస్తున్నారు. అందుకే జగన్ గెలుస్తారని తమకు సమాచారం ఉందని చెబుతున్నారు.ప్రస్తుతం తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు సీఎం అవుతారు. అప్పుడువిభజన సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. అదే జరిగితే కెసిఆర్ తన పార్టీని.. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతతోనే నడపాల్సి ఉంటుంది. ఇప్పటికే అక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకోవాలని బిజెపి భావిస్తోంది. ఈ లోక్ సభ ఎన్నికలతో ఫుల్ క్లారిటీ వస్తుంది. బిఆర్ఎస్ అనుకున్న స్థితిలో సీట్లు సాధించే ఛాన్స్ లేదు. ఇప్పుడు కెసిఆర్ కు ఒకే ఒక ఆసరా ఏపీలో వైసీపీ గెలుపు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులపై గులాబీ దళానికి ఒక అవగాహన ఉంది. వైసిపి పై తీవ్ర వ్యతిరేకత ఉంది. టిడిపి కూటమిపై సానుకూలత కనిపిస్తోంది. ఇది గులాబీ దళంలో నైరాశ్యానికి కారణం అవుతోంది.
===================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *