ABVP Ajay: జూన్ 26న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్:  ఏబీవీపీ నాయ‌కులు అజయ్

సిరాన్యూస్‌, ఓదెల
జూన్ 26న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్:  ఏబీవీపీ నాయ‌కులు అజయ్

తెలంగాణా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన, ప్రైవేటు, కార్పొరేట్ పాఠ‌శాలల దోపిడిని అరికట్టడంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ రాష్ట్ర నాయకుడు అజయ్, జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ ఆరోపించారు. ఓదెలలో సోమ‌వారం ముఖ్యకార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసంద‌ర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 26న బుధవారం రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బందుకు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిందే గానీ పరిపాలన విధానం మారలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి చేతకానితనం వల్ల అధికారులు ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారని, దీనివల్ల అధికారుల తీరు మారలేదన్నారు. విద్యారంగం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ది కరువయ్యిందని, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై పదిరోజులు గడుస్తున్నా, ప్రైవేట్ పాఠశాలల్లో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నా, అనుమతులు లేని విద్యాసంస్థలు నడుస్తున్నా, నిబంధనలకు వ్యతిరేకంగా విచ్చలవిడిగా పుస్తకాలు అమ్ముతున్నప్పటికీ పట్టించుకునే నాధుడే లేడని ఆవేద‌న వ్యక్తం చేశారు. విద్యాసంస్థలన్ని వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయని, ప్రభుత్వం ఏర్పడి ఆర్నెళ్ళు కావస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగం గురించి మాట్లాడిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉన్నాడనీ, విద్యకు మాత్రం మంత్రి కరువైపోయారని ఎద్దేవా చేశారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేసేలా స్పెషల్ కమిటీని వేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల దోపిడీని విద్యాధికారులు అరికట్టకుంటే ఏబీవీపీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉందని, గత ప్రభుత్వానికి పట్టించిన గతి తప్పదని హెచ్చరించారు. పాఠశాలలు యాజమాన్యలు, విద్యార్థులు, తల్లిదండ్రులు బందు కి సహకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *