విద్యాకమిషన్ రేసులో విద్యావేత్తలు

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ విద్యా కమిషన్ పదవి ఎవరి వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర క్యాబినెట్ మంత్రి హోదాతోపాటు, రాజ్యాంగ బద్ధమైన అధికారాలు ఉండటంతో విద్యా కమిషన్ చైర్మన్ పోస్టుకు చాలా క్రేజ్ ఏర్పడింది. దీనిపై చాలా మంది ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం కమిషన్ ను ఏర్పాటు చేయగా, ప్రభుత్వ లక్ష్యానికి తగ్గట్టుగా పనిచేసే వారి కోసం అన్వేషిస్తోంది. దీంతో పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళితోపాటు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రధాన పోటీదారులుగా చెబుతున్నారు. వీరితోపాటు తెలంగాణ జనసమితి అధినేత, ఎమ్మెల్సీ కోదండరాం కూడా రేసులో ఉన్నట్లు చెబుతున్నారు.కమిషన్ చైర్‌ పర్సన్ పదవిని ఆశిస్తున్న నలుగురిలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తుండగా, మరో ఇద్దరు తటస్థులు. విద్యావేత్తల కోటాలో చైర్మన్ గిరీని కోరుకుంటున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన ఆకునూరి మురళి భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతో విభేదించి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఏపీలోని వైసీపీ ప్రభుత్వంలో విద్యారంగ సలహాదారుగా పనిచేశారు. అక్కడ నాడు-నేడు మనబడి కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించారనే పేరుంది.అయితే ఏవో విబేధాల కారణంగా ఏపీలో సలహాదారు పదవిని సైతం మధ్యలోనే వదిలేశారు ఆకునూరి మురళి. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్న మురళిని కమిషన్ చైర్మన్‌గా నియమించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనగా చెబుతున్నారు. ఇదే సమయంలో ఆయన పక్క రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేయడం వల్ల విమర్శలు వచ్చే అవకాశం ఉందని వెనక్కి తగ్గుతున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది.తెలంగాణకు చెందిన ఆకునూరి మురళి ఉద్యోగ విరమణ తర్వాత రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. ఎన్నికల ముందు రకరకాల పార్టీల్లో చేరతారని ప్రచారం జరిగినా, సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితంగా మెలిగారని చెబుతారు. దాదాపు ఆయనకు కమిషన్ చైర్మన్‌గా నియమించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయంటున్నారు. ఇదే సమయంలో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ నాగేశ్వర్ పేర్లు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.తెలంగాణ సమాజంలో మంచి గుర్తింపు ఉన్న విద్యావేత్త హరగోపాల్‌ ను చైర్మన్ చేస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని కాంగ్రెస్‌లో ఓ వర్గం వాదనగా ఉంది. ఆయన కాదంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ పేరు పరిశీలించాలని ప్రతిపాదిస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌కూ సీఎం రేవంత్‌రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి. రెండు సార్లు ఎమ్మెల్సీగా పని చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు తెలంగాణపై విస్తృత అవగాహన ఉంది. అంతేకాకుండా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ నాగేశ్వర్, సీఎం రేవంత్‌రెడ్డి పలు విషయాల్లో కలిసి పని చేశారంటున్నారు. పలు సందర్భాల్లో నాగేశ్వర్ లాంటి వారి సేవలు కాంగ్రెస్ అధికారంలోకివచ్చాక వినియోగించుకుంటామంటూ పీసీసీ చీఫ్ హోదాలోనే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యమూ ఉంది.. అంతేకాకుండా ఇటీవల హైడ్రా ఏర్పాటు నేపథ్యంలో బహిరంగంగానే రేవంత్ కు నాగేశ్వర్ కితాబు ఇచ్చారు. దీంతో నాగేశ్వర్‌కు కూడా చాన్స్ ఉందంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *