సిరా న్యూస్,శ్రీకాకుళం;
శ్రీకాకుళం జిల్లా మందస మండలం సాబకోట సచివాలయంలో ఏసిబి అధికారుల మెరుపు దాడుల్లో లంచం తీసుకుంటూ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పట్టుబడ్డాడు . సాబకోట గ్రామ సచివాలయం పరిధిలో జగనన్న కాలనీ హౌసింగ్ బిల్లుల కోసం సింగుపురం గ్రామానికి చెందిన నిమ్మక పరశురాం అనే లబ్దిదారుడి నుంచి రూ. 5000/- లంచం తీసుకుంటూ సాబకోట సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎస్ లోకనాథం ఏసీబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సాబకోట పంచాయతీ సిరిపురానికి చెందిన నిరుపేద లబ్దిదారుడు పరశురాం పునాదుల వరకు ఇంటి నిర్మాణం చేశాడు.హౌసింగ్ స్కీం నుంచి తనకు రావాల్సిన సబ్సిడీ సొమ్ము ను తన ఖాతాలో జమ చేయాలని సాబకోట ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎస్ లోకనాథం ను సంప్రదించాడు.
ఇంజనీరింగ్ అసిస్టెంట్ లోకనాథం లబ్దిదారుడికి హౌసింగ్ బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేశాడు. సొబకోట సచివాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగిన పరశురాం కు రూ.5 వేలు లంచంగా ఇస్తే హౌసింగ్ బిల్లులు ముంజూరు చేస్తానని ఇంజనీరింగ్ అసిస్టెంట్ లోకనాథం ప్రలోభ పెట్టాడు. అయితే లంచం ఇవ్వటం ఇష్టం లేక పరశురాం శ్రీకాకుళం లోని అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) అధికారులను ఆశ్రయించాడు. ఏసిబి అధికారుల సూచనల మేరకు పరశురాం నుంచి లంచం సొమ్ము రూ. 5 వేలు ఇంజనీరింగ్ అసిస్టెంట్ తీసుకుంటుండగా ఏసిబి డిఎస్పీ బి వి రమణ మూర్తి నేతృత్వంలో సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.5 వేలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.