సిరాన్యూస్, ఆదిలాబాద్
ఆదిలాబాద్ లో ఘనంగా పొలాల అమావాస్య
ఆదిలాబాద్ జిల్లాలో పొలాల అమావాస్యను సోమవారం ప్రజలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రధానంగా వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకొని జీవిస్తూ ఉంటారు. వ్యవసాయ కార్యకలాపాలకు శుభప్రదంగా భావించే రోజు “పోలాల అమావాస్య.ష తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని రైతులకు అత్యంత ముఖ్యమైన పండగరోజు ఇది. పొలాల అమావాస్య సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో వస్తుంది. శివ,నారదపురాణాలలో కూడా పొలాల అమావాస్య గురించిన ప్రస్తావన ఉంది. దీనిని వ్యవసాయదారులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.తెలంగాణ లోని అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో వ్యవసాయదారులు శ్రావణమాస చివరి రోజుల్లో పొలాల అమావాస్యను ఘనంగా జరుపుకుంటారు.ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో గ్రామంలోని హనుమాన్, పోచమ్మ ఆలయాల చుట్టూ ప్రదర్శనలు చేసి ఇంట్లో పిండి పదార్థాలతో కూడిన నైవేద్యాన్ని సమర్పించారు. ముఖ్యంగా బసవేశ్వరుని రూపంలో ఉన్న ఎద్దులను కొలుస్తూ పొలాల అమావాస్య రోజు వాటికి ఆతిథ్యాన్ని అందజేశారు. పొలాల అమావాస్యను రైతుల అమావాస్యగా, వ్యవసాయ అమావాస్యగా కూడా పిలుస్తారు. పోలాల పండుగనుశ్రావణ మాసంలో ముగింపు అమావాస్య రోజున జరుపుకుంటారు. ఒకరోజు పార్వతి దేవి శివుడితో “నిరంతరము భక్తుల పూజలందుకునే నీవు…,నీ నందివాహనునికి కూడా పూజలందుకునే అవకాశాన్ని కల్పించలేకపోయావా!?అని కోరిందట.అప్పుడు “శ్రావణ మాసం చివరిరోజయిన అమావాస్య నాడు పొలాల అమావాస్య పేరుతో బసవన్నలను పూజించుకొనే వరాన్ని ప్రసాదించాడట శివుడు”. అని మన పూర్వీకులు పొలాల విశిష్టతను చెప్తుంటారు.పొలాల అమావాస్య రోజు నందీశ్వరున్ని పూజిస్తే సాక్ష్యాత్తు ఆ శివపార్వతులు ఆశీర్వదిస్తారని రైతుల ప్రగాఢ విశ్వాసం.