సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఎమ్మెల్యే పాయల్‌కు న్యాయవాదుల ఘన సన్మానం…
+ బార్ అసోసియేషన్‌లో ఆత్మీయ సన్మానం
ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని బార్ అసోసియేషన్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు న్యాయవాదులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో బార్ అధ్యక్షలు ఎన్రాల నగేషన్, ప్రధాన కార్యదర్శి చందు సింగ్ ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు ఎమ్మెల్యేకు బొకెలు అందించి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షులు నగేష్ మాట్లాడుతూ.. న్యాయవాదులు ఎదుర్కుంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. న్యాయవాదులకు ఆదిలాబాద్‌లో ఇండ్ల స్థలాల పంపిణీ, అడ్వొకేట్ ప్రొటక్షన్ యాక్ట్ తదితర అంశాలను గురించి విన్నవించారు. అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తి ఎంతో మహోన్నతమైనదని అన్నారు. కోర్టు కేసుల్లో చిక్కుకున్న నిరుపేదలకు అండగా నిలవాలని అకాక్షించారు. రానున్న రోజుల్లో న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు దశల వారీగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. తనను ఎంతో ఆత్మీయంగా సన్మానించిన న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపారు.