సిరా న్యూస్,ఖానాపూర్ టౌన్
ఖానాపూర్ ఆరవ వార్డు కౌన్సిలర్ రాజీనామా
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఆరవ వార్డు కౌన్సిలర్ రాజీనామా చేశారు. మంగళవారం మున్సిపల్ కమిషనర్ కు తన రాజీనామా పత్రాన్ని కౌన్సిలర్ ఆఫ్రిన్ బేగం అందజేశారు. కమిషనర్ మతతత్వ ధోరణి వల్ల విసుగు చెంది నా పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. నా రాజీనామాను ఆమోదించగలరని దరఖాస్తు చేసుకున్నారు. ఈసందర్బంగా 6వ వార్డు కౌన్సిలర్ ఆఫ్రిన్ బేగం మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్డు పై జరుగుతున్న ఆక్రమణల పై మున్సిపల్ కమిషనర్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేశాను. అయినా మున్సిపల్ కమిషనర్ పట్టించుకోకుండా తనను క్షేత్రా స్థాయికి వెళ్లి ఎదుటి వారితో వాగ్వివాదం చేయమనడం చాలా బాధకు గురి చేసిందని తెలిపారు. నేనే అక్కడికి వెళ్లి సమస్యను పరిష్కరిస్తే అధికారులు ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోమంటే 4వ వార్డు బీజేపీ కౌన్సిలర్ ను తీసుకుని వస్తానని.. మీరు కూడా రమ్మంటే అక్కడ కమిషనర్ బీజేపీ నాయకులతో నాకు వివాదం సృష్టించడానికి ప్రయత్నించారు. ఒక మైనార్టీ వర్గానికి చెందిన కౌన్సిలర్ ను బీజేపీ నాయకులతో వివాదాలకు పోతే ఖానాపూర్ పట్టణంలో మత ఘర్షణలు అయ్యే అవకాశం ఉన్నందున మీరు సమస్యను అధికారికంగా పరిష్కరించకుండా తనను వివాదం లోకి నేరుగా దింపడం సరైంది కాదన్నారు. ప్రధాన రహదారి పై పెరుగుతున్న ఆక్రమణలను ఆపడంలో కమిషనర్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. కౌన్సిలర్ గా మా బాధ్యతలు నిర్వర్తించడంలో ఎలాంటి సహకారం అందించకుండా వ్యవహరిస్తున్నందున తాను రాజీనామా చేసినట్లు తెలిపారు. ఇలాంటి అధికారి తో పని చేయడం సాధ్యం కాదన్నారు. ఈవిషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లి నా రాజీనామా ను ఆమోదం కోరుతానని తెలిపారు.