సిరాన్యూస్, హుజురాబాద్:
హాస్టల్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే కృషి చేయాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము యాదవ్
హుజూరాబాద్ నియోజకవర్గంలో శిథిలావస్థలో ఉన్న బీసీ బాలుర మరియు బాలికల హాస్టల్స్ నూతన భవనాలు నిర్మించాలని, అలాగే నూతన గ్రంథాలయం ఏర్పాటు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య( ఎఐఎస్ఎఫ్) జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము యాదవ్ కోరారు. శుక్రవారం హుజూరాబాద్ లో విలేకరులకు సమావేశంలో మాట్లాడుతూ హుజురాబాద్ బీసీ హాస్టల్, బాలికల హస్టల్స్ శిథిలావస్థలో ఉన్నాయని ఇప్పుడు హస్టల్స్ అద్దె భవనాల్లో నడస్తున్నాయని, విద్యార్థులు అద్దె భవనాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. హాస్టల్స్ కి నూతన భవనాలు, నూతన గ్రంథాలయం నిర్మాణ విషయం పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దృష్టి పెట్టాలని అన్నారు. ఓట్లు వేసి గెలిపించిన హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా రాజకీయ గోడవల పై దృష్టి పెడుతున్నారని ఇప్పటికైనా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి హుజురాబాద్ అభివృద్ధి కి పాటుపడాలని కోరారు. ఎమ్మెల్యే సొంత గ్రామమైన వీణవంక మండల సంబంధించిన ఎంజెపి గురుకుల పాఠశాల హుజూరాబాద్ లో అద్దె భవనం లో కొనసాగుతుందని వీణవంకలో నూతన భవన నిర్మాణానికి కృషి చేయాలన్నారు. బీసీ హాస్టల్ అద్దె భవనం మెయిన్ రోడ్డు పక్కన ఉండడం వల్ల విద్యార్థులు పాఠశాలకు వెళ్లే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అందువల్ల విద్యా ర్థులు చదువుకు దూరం అయ్యే అవకాశం ఉందన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మౌళిక సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం హస్టల్ మెస్ చార్జీలు పెంచాలని, స్కాలర్షిప్ ఫీజు రియింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని కేశబోయిన రాము యాదవ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి రాపెల్లి రోహిత్, కృష్ణ, మని, ప్రవీణ్, రాజు, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.