వీళ్లంతా ఎవర్రాబాబు…

కమలం కేడర్ లో అంతర్మధనం

సిరా న్యూస్,విజయవాడ;

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి నోటా కంటే ఓట్ల శాతం తక్కువ అని అంటారు. కమలం పార్టీ నేతలు ఆ మాటంటే కోప్పడతారు కానీ అభ్యర్థుల ఎంపిక చూస్తే తెలియడం లేదూ అని ప్రశ్నలు పార్టీ అగ్రనాయకత్వానికి సూటిగా తాకుతున్నాయి. ఆ పార్టీ ఆరు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఒక్కరూ బీజేపీ సిద్ధాంతాలను అలవర్చుకున్న వారు కాదు. పోనీ దశాబ్దాల తరబడి పార్టీలో పనిచేసిన వారు కాదు. అందులో నరసాపురం అభ్యర్థి శ్రీనివాస వర్మను మినహాయిస్తూ మిగిలిన ఐదుగురు పార్టీలు మారి వచ్చిన వాళ్లే. సహజంగా ఆర్ఎస్‌ఎస్ లేదా.. బీజేపీ అనుబంధ సంస్థల నుంచి వచ్చిన వారికి పార్టీ అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అయితే ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా అభ్యర్థుల ఎంపిక జరిగింది. అరకు నుంచి కొత్తపల్లి గీత, రాజమండ్రి నుంచి పురంద్రీశ్వరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, తిరుపతి నుంచి వరప్రసాదరావు, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఐదుగురిలో ఏ ఒక్కరికీ బీజేపీ బ్యాక్ గ్రౌండ్ లేదు. బ్యాక్ గ్రౌండ్ చూస్తే మాత్రం వీరికి మరో రాష్ట్రంలో అయితే సీటు దక్కేది కాదు. కేవలం ఏపీలో మాత్రమే సీట్లు దక్కాయన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఏపీలో బీజేపీ బలహీనం అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమి కావాలంటూ ప్రత్యర్థి పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. తమకు సరైన నేత లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉండటంతో బీరాలు పోవడం తప్ప బీజేపీకి ఏపీలో అంత సీన్ లేదని అనుకోవచ్చన్న అభిప్రాయం అభ్యర్థుల ఎంపిక చూస్తేనే అర్థవుతుందంటున్నారు. అరకు నుంచి బరిలోకి దిగుతున్న కొత్తపల్లి గీత గతలో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలోకి మారారు. ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అరకు పార్లమెంటు స్థానంలో ఇప్పటి వరకూ బీజేపీ గెలిచిన దాఖలాలు లేవు. అక్కడ కాంగ్రెస్, వైసీపీలు మాత్రమే గెలుస్తూ వస్తున్నాయి. అలాంటి సీటులో పార్టీ మారి వచ్చిన గీతను ఎంపిక చేశారంటున్నారు. పురంద్రీశ్వరి ఇప్పుడయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కానీ.. ఆమె కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి ఎన్టీఆర్ కుమార్తెగా ఆమెకు ఆ ప్రాధాన్యత దక్కిందనుకోవచ్చు. రాజమండ్రిలో బీజేపీ అభ్యర్థి ఎంపిక కొంత వరకూ సరైనదేనని చెప్పాలి. రాజమండ్రి పార్లమెంటు స్థానంలో బీజేపీ, టీడీపీ ఎక్కువ సార్లు గెలవడం కూడా ఆమె ఎంపిక ప్రాధాన్యతను చెబుతుంది. సామాజికవర్గం పరంగా కూడా అక్కడ ఆమె ఎంపిక సరైనదేనని అంటున్నారు. రాజంపేట నుంచి బరిలో ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి. 2014లో ఆయన జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు. తర్వాత సుదీర్ఘకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ లో చేరారు. అక్కడ ఇమడ లేకపోయారు. దీంతో చివరకు ఆయన బీజేపీని ఎంచుకుని రాజంపేట అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సీఎం రమేష్ అనకాపల్లి అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ఆయన టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. బీజేపీలో ఈయన వయసు నాలుగున్నరేళ్లు మాత్రమే. తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు అయితే ఏకంగా పార్టీ చేరిన రోజే ఆయన టిక్కెట్ దక్కించుకున్నారు. పార్టీలో చేరిన రోజే ఆయనకు టిక్కెట్ కన్ఫర్మ్ అయింది. ప్రజారాజ్యం, వైసీపీ, జనసేన ఇప్పుడు బీజేపీ.. పార్టీలు ఏదైనా టిక్కెట్ మాత్రం నాదేనంటూ ఆయన జనం ముందుకు వస్తున్నారు. ఒక్క నరసాపురం అభ్యర్థి శ్రీనివాసవర్మ మాత్రమే ఇందుకు మినహాయింపు. ఆయన బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ స్థాయి నుంచి ఎంపీ అభ్యర్థి టిక్కెట్ దక్కించుకున్నారు. ముప్పయి ఏళ్లుగా బీజేపీలో వివిధ పదవుల్లో ఉన్నారు. ఆయన ఒక్కడే ఇందుకు మినహాయింపు అన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
==============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *