సిరా న్యూస్,జయశంకర్ భూపాలపల్లి;
30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి మధుమేహా, బిపి పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో ఆరోగ్య కార్యకలాపాలపై వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
పోషకాహారలోపం ఉన్న పిల్లలను గుర్తించి వారిని అంగన్వాడి కేంద్రాలలో చేర్చాలని తెలిపారు. అలాంటి చిన్నారుల ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ పరిపూర్ణ ఆరోగ్య వంతులుగా తయారు చేయాలని సూచించారు. అన్ని ప్రాథమిక, ఉప ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య సమితి సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలకు కావాల్సిన సౌకర్యాలు కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు. యాస్పిరేషనల్ బ్లాకు మండలాలైన పలిమెల, మహా ముత్తారంలలో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. జిల్లాలో ఏ ఎన్సీ రిజిస్ట్రేషన్స్ 98 శాతం జరుగుతున్నాయని నూరు శాతం చేయాలని పేర్కొన్నారు.
ఆరోగ్య సేవల అభివృద్ధి, ఆరోగ్య సదుపాయాల విస్తరణ, టీకాల పంపిణీ, మాతాశిశు సంరక్షణ కార్యక్రమాలు మరియు గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య శిబిరాల నిర్వహణను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా వైద్య సేవల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడంపై ప్రణాళికలు రూపొందించారలని సూచించారు. ప్రతి ఒక్కరికీ సత్వర ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. విద్యా సంస్థలలో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, నిరంతరం వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, అత్యవసర చికిత్స సేవలను మరింత మెరుగుపరచడం వంటి అంశాలపై వైద్యాధికారులు దృష్టి సారించాలని సూచించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వైద్యానికి ధికారి డా మధుసూదన్,
డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ కొమురయ్య, డాక్టర్ రవి రాథోడ్, పి ఓ లు డాక్టర్ శ్రీదేవి డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు.