సిరా న్యూస్;
భారత్.. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కలవరిస్తున్న పేరు. ఒక విధంగా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అత్యంత వేగంగా పరుగులు పెడుతున్న దేశం కూడా భారతదేశమే. ప్రపంచ ఉద్రిక్తతల మధ్య శాంతి జెండాను పట్టుకొని, సగర్వంగా ముందుకు నడుస్తున్న దేశం. అంతర్జాతీయ వేదికలపై అగ్రదేశాలతో సమానమైన స్థానాన్ని దక్కించుకుంటున్న దేశం. అయితే, ఈ సామర్థ్యమే పాశ్చాత్య దేశాలను భయపెడుతుందా..? అందుకే, భారత్‌పై నిందారోపణలు చేస్తున్నారా..? మొన్నటి వరకూ కెనడా, భారత్‌లకే పరిమితమైన వివాదంలో ఇటీవల అమెరికా కాలుపెట్టింది. ఒక విధంగా, కెనడాకు, భారత్‌కు మధ్య పుల్ల పెట్టింది అమెరికానే అనే వాదనలూ ఉన్నాయి.ఇప్పుడు చూస్తే, బ్రిటన్ కూడా తగుదునమ్మా అని తల దూర్చడానికి వచ్చింది. దీనికి తోడు.. తాజాగా ఫారిన్ ఇంటర్‌ఫరెన్స్ కమిషన్ ముందు కెనడా ప్రధాని ట్రూడో విచిత్రమైన వాదన చేశాడు. చైనా, రష్యా బ్రాకెట్‌లో ఇండియాను దూర్చడానికి తెగ ప్రయత్నించాడు. అందుకే.. కాస్త లోతుగా వెళ్లి ఆలోచిస్తే చాలా అనుమానాలు కలుగుతున్నాయి. ఒక వైపు కెనడా ఓవరాక్షన్ చేస్తుంటే.. మరోవైపు, అమెరికా డ్రామాలు స్పష్టంగానే తెలుస్తున్నాయి. ఇప్పుడిక, యూరప్ కూడా ఇండియాపై ఆరోపణలు చేయడానికి రెడీ అవుతోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. ఇదేదో కావాలని చేస్తున్న ప్రచారంలా కనిపిస్తోంది. భారత్‌ను టార్గెట్ చేస్తూ ఏదో కుట్ర పన్నుతున్నారనే అనుమానం వస్తుంది.ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను భారతీయ ఏజెంట్లు చంపారనే ఆరోపణ వ్యవహారంలో ఫారిన్ ఇంటర్‌ఫరెన్స్ కమీషన్ ముందు కెనడా ప్రధాని ట్రూడో చాలా డ్రామా చేశాడు. సమాధానాలు వెతుక్కుంటూ.. తడబడుతూ.. మధ్య మధ్యలో చాలా గ్యాప్‌లు ఇచ్చిన ట్రూడో మాటతీరు చూస్తే, భారత్‌ను నిందించడానికి కష్టపడి కథలు అల్లినట్లు స్పష్టంగా అర్థమయ్యింది. అక్టోబర్ 16న, ఫారిన్ ఇంటర్‌ఫరెన్స్ కమీషన్ ముందు కెనడా ప్రజాస్వామ్యంలో విదేశీ జోక్యం గురించి కెనడా ప్రధాని ట్రూడో దాదాపు 6 గంటల పాటు తన వాగ్మూలాన్ని ఇచ్చారు. ఇందులో భాగంగా.. నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెన్సీ ప్రమేయానికి సంబంధించి తన వద్ద ఎలాంటి ‘రుజువు చేసే సాక్ష్యం’ లేదని వెల్లడించాడు. అయితే గత సంవత్సర మొదటి సారి చేసిన ఆరోపణల నాటికే తన వద్ద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందని వెల్లడించిన ట్రూడో ఇప్పుడు మాట మార్చి.. భారత్‌తో కెనడా ఎలాంటి సాక్ష్యాధారాలను పంచుకోలేదని ఒప్పుకున్నాడు. కేవలం భారత్‌తో కలిసి పని చేయడానికి మాత్రమే ప్రయత్నించాననీ.. కానీ, భారత్ రుజువు కావాలని డిమాండ్ చేస్తూనే ఉందని వెల్లడించాడు.భారత్‌పై అనుమానానికి వివరణ ఇస్తూ.. “మీ భద్రతా ఏజెన్సీలోనే రుజువు ఉందనీ.. మీరే రుజువు కనిపెట్టాలని” భారత్‌తో చెప్పినట్లు ఫారిన్ ఇంటర్‌ఫరెన్స్ కమీషన్ ముందు ట్రూడో వ్యాఖ్యానించారు. “కెనడా సార్వభౌమాధికారాన్ని భారత్ ఉల్లంఘించిందినీ.. కెనడా పౌరులకు ఉండే భావ ప్రకటన స్వేచ్ఛను నేరంగా చూపుతుందని” అవహేళనగా మాట్లాడారు. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వం సాక్ష్యాన్ని చూపించమని అడగుతుంటే… కెనడాలోని భారత వేర్పాటువాదుల భావ ప్రకటనా స్వేచ్ఛను సమర్థిస్తూ ప్రధాని ట్రూడో విచిత్ర వాదన చేశారు. అయితే, ట్రూడో వాగ్మూలాన్ని బట్టి ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. నిజ్జర్ హత్యలో భారత ఏజెన్సీల పాత్ర ఉందన్న ఆరోపణలో ఎలాంటి సాక్ష్యాలు కెనడా దగ్గర లేవని గత ఏడాదిగా భారత్ చేస్తున్న వాదనలు నిజమని తేలింది. నిజానికి, కెనడాలో ప్రజల మద్దతును కోల్పోతున్న ట్రూడో.. తన రాజకీయ ప్రయోజనాల కోసం… పదే పదే కెనడా సార్వభౌత్వం అనే పదాన్ని వాడుతూనే ఉన్నారు. అలాగే, భారత్ కెనడా ప్రభుత్వాన్ని, కెనడీయన్లను అవమాన పరిచిందటూ వ్యాఖ్యానించారు. “కెనడా సార్వభౌమాధికారంలో భారత్ జోక్యం చేసుకొని, చాలా భయంకరమైన తప్పు చేసిందనీ.. కెనడా దానికి స్పందించాల్సిన అవసరం ఉందంటూ” రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.ఇక, గతేడాది అమెరికా కూడా అమెరికాలో నివశిస్తున్న సిక్కు వేర్పాటు వాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హత్య చేయాలని భారత్ ఏజెన్సీ స్కెచ్ వేసిందని ఆరోపించింది. దీనిపై ఇప్పటికీ వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిజానికి, కెనడా ఇంత దురుసుగా ప్రవర్తించడం వెనుక అమెరికా హస్తం ఉందనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఒక విధంగా ఆలోచిస్తే.. కెనడాకు, భారత్‌కు మధ్య వివాదం రేగడానికి అమెరికానే కారణమనే వాదనలు గతంలోనే వినిపించాయి. కెనడాకు చెందిన సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య తర్వాత యునైటెడ్ స్టేట్స్‌లోని గూఢచారి సంస్థలు కెనడాకు సమాచారం అందించాయి.హత్యలో భారతదేశ ప్రమేయం ఉందని కెనడా నిర్ధారించుకుందని” పాశ్చాత్య మిత్రరాజ్యాల అధికారులు వెల్లడించినట్లు గతేడాది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అయితే, కెనడా “అత్యంత ఖచ్చితమైన గూఢచారాన్ని” అభివృద్ధి చేసుకొని, ఆ తర్వాతే ప్రధాని ట్రూడో, భారత్‌ను దోషిని చేసి మాట్లాడాడని కెనడా అధికారులు తెలిపారు. కానీ, కెనడాలోని యునైటెడ్ స్టేట్స్ రాయబారి డేవిడ్ కోహెన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో… నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందని ట్రూడో చేసిన బహిరంగ ఆరోపణ వెనుక “ఫైవ్ ఐస్ భాగస్వాముల మధ్య షేర్డ్ ఇంటెలిజెన్స్” ఉందని వెల్లడించారు. ఈ ఐదు దేశాల షేర్డ్ ఇంటెలిజెన్స్‌లో అమెరికా ప్రధాన హస్తంగా పనిచేస్తుంది.నిజానికి ఈ ఫైవ్ ఐస్ అలయెన్స్ అనేది ఒకటుందని బయట ప్రపంచానికి తెలియకపోవడం విశేషం. భారత్, కెనడాల మధ్య గతేడాది దౌత్యపరమైన ఉద్రిక్తతల తర్వాత మాత్రమే.. మొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్ అధికారికంగా ఈ “ఫైవ్ ఐస్ భాగస్వాముల మధ్య ఉన్న షేర్డ్ ఇంటెలిజెన్స్” ఉందని ధృవీకరించింది. ఇదే నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం గురించి కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోకు తెలియజేసింది. తాజా వాగ్మూలంలో కూడా ప్రధాని ట్రూడో దీన్ని అంగీకరించారు. ఫైవ్ ఐస్ ఇంటిలిజెన్స్ ఇచ్చిన సమాచారంతోనే తాను భారత్‌ను అనుమానించినట్లు వెల్లడించారు. ఇక, ఈ ఆరోపణల నేపథ్యంలో.. గతేడాది సెప్టెంబర్ నెలలో, అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ జె. బ్లింకెన్ కెనడియన్ దర్యాప్తుకు సహకరించాలని భారతదేశానికి విజ్ఞప్తి చేశాడు. ఈ వ్యాఖ్యలు చేస్తూనే, అమెరికాకు భారతదేశానికి మధ్య ఎటువంటి దౌత్యపరమైన ఇబ్బందులూ రాకుండా ఉండటానికి కూడా తీవ్రంగా ప్రయత్నించాడు. ఎందుకంటే, అమెరికా బద్ద శత్రువైన చైనాకు చెక్ పెట్టడానికి భారత్‌ను వాడుకోవడం అమెరికాకు అత్యవసరం. అందుకే, భారత్‌ను సన్నిహిత భాగస్వామిగా కోరుకుంటున్న అమెరికా… వెనక నుండే పావులు కదిపింది.ఇక, ఇప్పుడు ఈ డ్రామాలో యూనైటెడ్ కింగ్‌డమ్ కూడా కొత్తగా చేరింది. భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడటానికి నాకు కూడా కొన్ని డైలాగులు ఇచ్చారు అన్నట్లు తన పాత్రను పోషిస్తుంది. అక్టోబర్ 16న, యూకే ‘ఫారిన్, కామన్వెల్త్ డెవలప్‌మెంట్ ఆఫీస్-FCDO’.. కెనడా, భారత్ మధ్య నడుస్తున్న దౌత్య వివాదంలో కెనడాకు మద్దతుగా ప్రకటన విడుదల చేసింది. “కెనడా చట్టపరమైన ప్రక్రియలో భారత్ సహకరించాలనీ.. ఈ దౌత్య సమస్యలో తదుపరి దశ భారత్ నుండి రావాల్సిన సహకారమేనని” పేర్కొంది. అలాగే, కెనడా న్యాయవ్యవస్థపై యూకేకి పూర్తి విశ్వాసం ఉందనీ.. కెనడా సార్వభౌమాధికారం, చట్టాన్ని గౌరవించడం చాలా అవసరం’ అని వకాల్తా పుచ్చుకుంది. అయితే, ఇటీవల, కెనడా నుండి భారత్ తన హైకమిషనర్ సంజయ్ వర్మతో పాటు మరో ఐదుగురు దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవడం.. భారతదేశం నుండి తాత్కాలిక హైకమిషనర్‌తో సహా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించిన తర్వాత ఈ దౌత్యపరమైన వివాదంలో యూకే జోక్యం చేసుకుంది.