సిరా న్యూస్, ఆదిలాబాద్ వ్యవసాయం:
బొప్పాయి సాగులో లక్షల్లో లాభాం…
+ తోటల సాగుతో ఆదర్శంగా నిలుస్తున్న రైతు అస్తక్ సుభాష్
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు లేక అనేక మంది రైతు అప్పులపాలవుతున్నారు. చాలా మంది రైతులు ఏళ్లుగా పంటల సాగులో మూస ధోరణి అవలంభించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మార్కెట్‌తో సంబంధం లేకుండా ప్రతీ ఏడాది ఒకే రకమైన పంటలు వేయడం కూడ రైతుల పాలిట శాపంగా మారిందని చెప్పవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఎక్కువగా పత్తి, సోయా వంటి పంటల వైపు మొగ్గు చూపడంతో తరుచుగా నష్టాలు చవిచూస్తున్నారు. కానీ ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పార్డి గ్రామానికి చెందిన రైతు అస్తక్ సుభాష్ మాత్రం అందరికి భిన్నంగా తోటల పెంపకంతో మంచి లాభాలు ఆర్జిస్తూ అందరికి అదర్శంగా నిలుస్తున్నాడు.
అర ఎకరంలో 400 బొప్పాయి మొక్కలు…తరుచుగా టమాట, కీరా దోసా, చెరుకు, వంగా ఇలా సీజన్ ప్రకారం పంటలు పండించే అస్తక్ సుభాష్ కేవలం రెండు ఎకరాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. మరో 4 ఎకరాల్లో వాణిజ్య పంటలు పండిస్తున్నప్పటికీ కూడ, 2 ఎకరాల్లో ప్రత్యేకంగా తోట ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం అర ఎకరం విస్తీర్ణంలో బొప్పాయి తోట సాగు చేసి మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు.
పెట్టుబడి రూ. 35వేలు… ఆదాయం రూ. 1.40వేలు…
అర ఎకరంలో బొప్పాయి సాగుకు దాదాపు రూ. 35వేల పెట్టుబడి ఖర్చు అయినట్లు రైతు తెలిపాడు. రూ. 15వేలతో తైవాన్ రెడ్ లేడీ రకానికి చెందిన 400ల బొప్పాయి మొక్కలను 2023 ఫిబ్రవరిలో ప్రత్యేకంగా తెప్పించి, అర ఎకరంలో నాటడం జర్గింది. వీటిలో నాలుగైదు మొక్కలు మినహా అన్ని కూడ మంచి కాత ఇవ్వడంతో, ఇప్పటి వరకు 60 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. వ్యాపారులే చేనుకొచ్చి మరీ క్వింటాళ్‌కి రూ. 2వేలు చెల్లించి, బొప్పాయి కోసుకొని వెళ్తుడంతో రవాణా, మార్కెట్ ఇబ్బంది లేదు. ఇంకా 10క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు రైతు చెబుతున్నాడు. సంవత్సర కాలం మాత్రమే ఉండే ఈ తోట నిర్వహణకు పెద్దగా కష్టపడాల్సిన పని కూడ లేదని, నీళ్లు పుష్కలంగా ఉంటే చాలని ఆయన చెబుతున్నాడు. రైతులు సాంప్రదాయ పంటల సాగుతో పాటు తోటల పెంపకంపై దృష్టి సారించాలని, సీజన్‌కు తగట్టు తోటలు వేసుకుంటే లాభాలు తప్పక వస్తాయని చెబుతున్నాడు.