Andhra Bhoja, Emperor of Vijayanagara Empire “Sri Krishnadeva Rayalu” ఆంధ్ర భోజుడు, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి “శ్రీ కృష్ణదేవ రాయలు”

-నేడు ఆయన జయంతి

సిరా న్యూస్;
శ్రీ కృష్ణదేవ రాయలు అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకుడుగా పనిచేసిన తుళువ నరసనాయకుని మూడవ కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు. నరసనాయకుడు పెనుకొండలో ఉండగా, రెండవ భార్య నాగలాంబకు 1471 జనవరి 17న జన్మించాడు కృష్ణదేవరాయలు. ఈయన పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుడుగా మరియు కన్నడ రాజ్య రమారమణగా కీర్తించబడినాడు. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి “అప్పాజీ” (తండ్రిగారు) అని పిలిచేవాడు.రాయలు, తుళువ నరస నాయకుని రెండవ భార్య అయిన నాగలాంబ (తెలుగు ఆడపడుచు) కుమారుడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలు నూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించాడు. రాయలు తల్లి నాగలాంబ గండికోటను పాలించిన పెమ్మసాని నాయకులు ఆడపడచు. 240 కోట్ల వార్షికాదాయము ఉంది. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్థిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించాడు.కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు.
ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, మదాలసాచరితము, సత్యవధూపరిణయము, సకలకథాసారసంగ్రహము, జ్ఞానచింతామణి, రసమంజరి తదితర గ్రంథములు, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు. “తెలుగదేల యన్న దేశంబు తెలుగేను తెలుగు రేడ నేను తెలుగొకొండ ఎల్ల జనులు వినగ ఎరుగవే బాసాడి దేశభాష లందు తెలుగు లెస్స” అన్న పలుకులు రాయలు వ్రాసినవే. రాయల ఆస్థానానికి భువన విజయము అని పేరు. భువనవిజయంలో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములుగా ప్రఖ్యాతి పొందారు.”తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స..”అని మన తెలుగు భాషను కీర్తించిన తెలుగు వల్లభుడు, ఆంధ్ర భోజుడు,విజయనగర సామ్రాజ్య చక్రవర్తి, సాహితీ సమరాంగణ చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు. కృష్ణదేవ రాయలు తక్కిన విజయనగర రాజులలాగే వైష్ణవుడు. కానీ పరమతసహనశీలుడు. అనేక వైష్ణవాలయాలతో పాటు శివాలయాలను నిర్మించాడు. అంతేకాక ధూర్జటి, నంది తిమ్మన వంటి పరమశైవులకు కూడా తన సభలో స్థానం కల్పించాడు. అనేక దాన ధర్మాలు చేసాడు. ముఖ్యంగా తిరుమల శ్రీనివాసులకు పరమ భక్తుడు, సుమారుగా ఏడు పర్యాయములు ఆ దేవదేవుని దర్శించి, అనేక దానధర్మాలు చేశాడు. ఇతను తన కుమారునికి తిరుమల దేవ రాయలు అని, కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు పెట్టుకున్నాడు. కృష్ణదేవ రాయలు చెన్నకేశవస్వామి వారి దేవాలయం కట్టించాడు. కృష్ణదేవ రాయలుకు తిరుమల దేవి, చిన్నాదేవి ఇద్దరు భార్యలని లోక విదితము.
కానీ, ఆముక్తమాల్యద ప్రకారం ఈయనకు ముగ్గురు భార్యలు (తిరుమలాదేవి, అన్నపూర్ణ, కమల). కృష్ణదేవరాయలు విజయనగర సామంతుడైన శ్రీరంగపట్నం రాజు కుమార వీరయ్య కూతురు తిరుమలాదేవిని 1498లో వివాహం చేసుకున్నాడు. పట్టాభిషిక్తుడైన తర్వాత రాజనర్తకి అయిన చిన్నాదేవిని వివాహమాడాడని ప్రతీతి. ప్రతాపరుద్ర గజపతిని ఓడించి, ఆయన కూతురైన తుక్కా దేవిని మూడవ భార్యగా స్వీకరించాడటనటానికి చారిత్రకాధారాలున్నాయి. ఈమెనే కొందరు లక్ష్మీదేవి అని, జగన్మోహిని అని కూడా వ్యవహరించారు. చాగంటి శేషయ్య, కృష్ణరాయలకు అన్నపూర్ణమ్మ అనే నాలుగవ భార్య ఉందని భావించాడు. కానీ, చిన్నాదేవే అన్నపూర్ణమ్మ అని కొందరి అభిప్రాయం. డొమింగో పేస్ ప్రకారం కృష్ణరాయలకు పన్నెండు మంది భార్యలు. కానీ అందులో తిరుమలాదేవి, చిన్నాదేవి, జగన్మోహిని ప్రధాన రాణులని చెప్పవచ్చు.అయితే శాసనాల్లో ఎక్కువగా ప్రస్తావించబడిన తిరుమలాదేవి పట్టపురాణి అయిఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం ఇద్దరు కుమార్తెలు, వారిలో పెద్ద కూతురు తిరుమలాంబను ఆరవీడు రామ రాయలకు, చిన్న కూతురును రామ రాయలు సోదరుడైన తిరుమల రాయలుకు ఇచ్చి వివాహం చేసాడు. ఒక్కడే కొడుకు, తిరుమల దేవరాయలు. ఇతనికి చిన్న తనంలోనే పట్టాభిషేకం చేసి, తానే ప్రధానిగా ఉండి రాజ్యవ్యవహారాలు చూసుకునేవాడు. కాని దురదృష్టవశాత్తూ తిరుమల దేవ రాయలు 1524లో మరణించాడు. ఈ విషయంపై కృష్ణ దేవ రాయలు తిమ్మరుసును అనుమానించి, అతనిని గ్రుడ్డివానిగా చేసాడు. తానూ అదే దిగులుతో మరణించినాడని ఓ అభిప్రాయము. మరణానికి ముందు చంద్రగిరి దుర్గమునందున్న సోదరుడు, అచ్యుత రాయలును వారసునిగా చేసాడు. శ్రీ కృష్ణ దేవరాయలు మతము దృష్ట్యా విష్ణు భక్తుడు అని అయన వ్రాసిన ఆముక్తమాల్యద తెలుపుచున్నది. అయితే శ్రీ కృష్ణ దేవరాయలు ఏ కులానికి చెందినవాడు అనే విషయంపై సాహిత్యవేత్తల్లోను, చరిత్రకారుల్లోను భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్రీ కృష్ణ దేవరాయల తండ్రియైన తుళువ నరస నాయకుడు బంటు అనే నాగవంశపు క్షత్రియ కులానికి చెందినవాడని కొన్ని చరిత్ర పుస్తకాలు తెలుపుచున్నవి. శ్రీ కృష్ణ దేవరాయల తల్లి పేరు నాగలాదేవి. ఆముక్తమాల్యదలోని 19వ పద్యము ప్రకారము శ్రీ కృష్ణ దేవరాయలు చంద్రవంశమునకు చెందినవాడని, 22-23-24 పద్యాల ప్రకారం శ్రీ కృష్ణ దేవరాయల ముత్తాత అయిన తిమ్మరాజు యయాతి వంశస్థుడు అని తెలుస్తున్నది. కొన్ని సాహిత్య పుస్తకాల్లో శ్రీకృష్ణదేవరాయలు కురూబు యాదవుడని రచయితలు వ్రాశారు. ఇందుకు అష్ట దిగ్గజాలలో ఒకరైన తిమ్మన రచించిన పారిజాతాపహరణంలో, శిలాశాసనాలలో లిఖించబడినది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన పాలకుడు శ్రీ కృష్ణదేవరాయులు మరణంపై ఆది నుంచి అనుమానాలే. ఆయన గతించిన తేదీపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ తాజాగా కర్నాటకలోని ఓ చారిత్రక శాసనంలో కృష్ణదేవరాయల మరణతేదీపై సందిగ్ధం వీడింది. కర్ణాటకలోని తుమకూర్ జిల్లాలోని ఒక ఆలయంలో బయటపడ్డ శాసనం. ఈ శాసనం ప్రకారం కృష్ణదేవరాయలు అక్టోబర్ 17,1529న తుదిశ్వాస విడిచారని తేలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *