సిరా న్యూస్,విజయవాడ;
ఏపీలో గత ఐదేళ్ల క్రితం మూతబడ్డ అన్నా క్యాంటీన్లను కొత్త ప్రభుత్వం తిరిగి తెరిపించేలా పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15 సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటిన్లను ప్రారంభించాలని గతంలోనే ప్రాథమికంగా నిర్ణయించారు. తాజాగా అదే రోజును ఖరారు చేశారు. పైగా అన్నా క్యాంటిన్ల ప్రారంభానికి టైం కూడా ఫిక్స్ చేశారు. ఆగస్టు 15న సాయంత్రం 6.30 నిమిషాలకి అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లుగా మంత్రి పి. నారాయణ తెలిపారు. తొలుత మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను తెరిచి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. అలా ఆగస్టు 15న సాయంత్ర 6.30 గంటలకు కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఏర్పాటు చేయబోతున్న అన్నా క్యాంటీన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని నారాయణ స్పష్టం చేశారు. ఆ మరుసటి రోజు నుంచి మిగిలిన 99 క్యాంటీన్లను ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారని మంత్రి నారాయణ వెల్లడించారు.