సిరా న్యూస్, ఆదిలాబాద్
పరీక్షలు పెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి : సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్
* ఏఓ రవీందర్‌కి వినతిపత్రం అందజేత
ఆశాలకు నష్టం కలిగించే, ఎగ్జామ్స్ పెట్టే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. ఆశాల సమస్యలను పరిష్కారం చేయాలని శుక్రవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ అదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఏఓ రవీందర్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లు గిరిజన ప్రాంతంలో గత 33 సంవత్సరాలు మైదాన ప్రాంతంలో గత 19 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారని తెలిపారు. ప్రారంభం నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహించిన అనేక ట్రైనింగ్ లు పొందారని, రిజిస్టర్ రాయడం సర్వేలు చేయడం, బిపి, షుగర్, థైరాయిడ్ తదితర అన్ని రకాల జబ్బులను గుర్తిస్తున్నారని తెలిపారు.ప్రభుత్వం సప్లై చేస్తున్న మందులను ప్రజలకు అందిస్తున్నారు.తగిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తున్నారని తెలిపారు. కరోనా మహమ్మారి కాలంలో కరోనాను నియంత్రించడంలో ఆశా వర్కర్లు కీలకపాత్ర పోషించారని తెలిపారు. (డబ్ల్యూ.ఎచ్.ఓ.) ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ గ్లోబల్ లీడర్స్ అని ఆశా వర్కర్లకు అవార్డులను కూడా ప్రకటించిందన్నారు.ఇంత సీనియారిటీ ఉన్న ఆశ వర్కర్లకు కొత్తగా ఎగ్జామ్స్ నిర్వహించి కొత్తగా ఆశాల జ్ఞాపకశక్తిని మళ్ళీ నిరూపించుకోవాలని చెప్పడం సమంజసం కాదని తెలిపారు. వెంటనే పరీక్షల నిర్వహణ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న, ఉపాధ్యక్షులు అగ్గిమల్ల స్వామి, ఆశా యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం. సుజాత,ఆశా నాయకులు అర్చన, పుష్ప,సురేఖ, లక్ష్మి,స్వప్న తదితరులు పాల్గొన్నారు.