11 నుంచి ఏపీ బడ్జెట్ భేటీ

 సిరా న్యూస్,విజయవాడ;
ఈ నెల 11 నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆర్థిక పద్దుతో పాటు పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేసింది.అసెంబ్లీ సమావేశాలు నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. నవంబర్ 11వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నే ప్రవేశపెట్టిన సర్కార్… ఇక పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది.తాజాగా ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో భాగంగా… పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. నవంబర్ 11వ తేదీన లేదా మరునాడు వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ సారి అసెంబ్లీ సమావేశాలు పది రోజులకుపైగా జరిగే అవకాశం ఉంది.ఈ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడంతో పాటు కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటివరకూ ఉన్న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ నవంబర్ నెలాఖరుతో ముగియనుంది. ఈ క్రమంలోనే… పూర్తిస్థాయి బడ్జెట్ కు సర్కార్ సిద్ధమైంది.నిజానికి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే ఏడాదిలో రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు వెళుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.ఆర్థిక పరిస్థితి పై స్పష్టత వచ్చేందుకు గడువు తీసుకోవాల్సి వచ్చిందని వివరించాయి. అందుకు అనుగుణంగానే రెండోసారి కూడా ఏపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ ప్రవేశపెట్టింది.చివరిసారిగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు పలు కీలక అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేసింది. ఆర్థిక పరిస్థితి, మద్యం, శాంతి భద్రతలపై వివరాలను సభ ముందుకు ఉంచింది. గత సమావేశాల్లోనే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతారని భావించినప్పటికీ… ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే కొనసాగించింది. ఈ గడువు ఈనెల చివరితో పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరగబోయే సమావేశల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని సర్కార్ నిర్ణయించింది.ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ తో పాటు కీలక అంశాలు సభలో చర్చకు అవకాశం ఉంది. సూపర్ సిక్స్ లోని స్కీమ్ ల అమలు, నూతన మద్యం పాలసీ, ఉచిత ఇసుక సరఫరాపై చర్చ జరగనుంది. అంతేకాకుండా… మరికొన్ని కొత్త స్కీమ్ ల అమలుపై కూడా సభలో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.అసెంబ్లీ సమావేశాల నిర్వహణ నేపథ్యంలో నవంబర్‌ 6వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశాల నిర్వహణతో పాటు బడ్జెట్ పై లోతుగా చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా… సభ ముందుకు తీసుకురావాల్సిన అంశాలు చర్చకు రానున్నాయి.
సూసర్ సిక్స్ కు బడ్జెట్ కేటాయింపులు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పటయి ఐదు నెలలుకావస్తుంది. ఇప్పటి వరకూ ఎన్నికలసమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో కొన్నింటిని మాత్రమే అమలు చేసింది. ప్రధానంగా పింఛను నాలుగు వేల రూపాయలకు పెంచడంతో పాటు తాజాగా ఉచిత గ్యాస్ సిలిండ్ పథకాన్ని దీపావళి రోజు నుంచి లాంచ్ చేసింది. ఉచిత ఇసుక, ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేయడం, మెగా డీఎస్సీ వంటి వాటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తొలి రోజునే సంతకాలు చేశారు. కానీ సూపర్ సిక్స్ హామీలలో ఒకటి రెండు మాత్రమే అమలు చేయడంతో ఇటు ప్రజల్లో కొంత అసంతృప్తి అయితే ఉంది. అదే సమయంలో విపక్షాలకు విమర్శలు చేయడానికి ఒక దారి దొరికినట్లయింది.అయితే వీటన్నింటికీ చెక్ పెట్టేలా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల గురించి తేల్చేసే సమయం దగ్గర పడింది. బడ్జెట్ సమావేశాల్లో వీటిపై స్పష్టత రానుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇన్నాళ్లయినా పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టలేదు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పైనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దీనివల్ల సూపర్ సిక్స్ హామీల అమలుపై స్పష్టత రాకుండా ఉంది. తల్లికి వందనం లాంటి ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరి నెల నుంచి అమలు చేయడానికి సిద్ధమని మంత్రల ప్రకటనతో తెలిసినా, దానికి ఎంత నిధులు కేటాయిస్తారన్నది మాత్రం ఇంకా తేలలేదు. ఇక మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కూడా అంతే. త్వరలో అంటూ మంత్రులు ఊరించడం మినహా నిధుల కేటాయింపు, అమలు తేదీపై స్పష్టత రాకపోవడంతో దానిపై విపక్షాలు నిలదీస్తున్నాయి.నవంబరు 12వ తేదీన రాష్ట్ర పూర్తిస్థాయిబడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఇందుకు సంబంధించి అధికారులు కసరత్తులు కూడా ప్రారంభించారు. దాదాపు బడ్జెట్ పై అంకెలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. గత ప్రభుత్వం చేసిన అప్పులతో పాటు సంక్షేమపథకాలను అమలు చేయాలంటే ఎక్కువ నిధులు అవసరం. అందుకు అవసరమైన నిధుల సమీకరణ పై అనేక రకాలుగా అధికారులు ప్రయత్నాలు చేశారు. కొంత మేరకు సఫలమయ్యారు. Also Read – సీక్కోలు వాసులకు కేంద్ర మంత్రి ఒకేసారి రెండు గుడ్ న్యూస్ లు దేనికి ఎంత నిధులు… కానీ సూపర్ సిక్స్ హామీలన్ని అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదన్నది అధికారుల వాదన. ఇప్పటికే ఐదు నెలల్లోనే కొత్త ప్రభుత్వం నలభై ఏడు వేల కోట్ల రూపాయలను రుణాలుగా సేకరించింది. ఇంకా తేవాల్సిన అప్పులు చాలా ఉన్నాయి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత సానుకూలత ఉండటంతో భవిష్యత్ లో పరిస్థిితి మెరుగు పడుతుందని భావిస్తున్నారు. ప్రతిపద్దుకూ ఖచ్చితంగా లెక్కలు బడ్జెట్ లో చూపించాలి. అందుకే సూపర్ సిక్స్ హామీలకు ఏ మేరకు నిధులను కేటాయించనుందన్నది నవంబరు 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేపెట్టే బడ్జెట్ లో తేలనుంది. అప్పటికి గాని హామీల అమలుపై కొంత మేరకు స్పష్టతరానుంది. అప్పటి వరకూ వెయిట్ చేయాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *