మహీధరరెడ్డికి బుజ్జగింపులు… తలొగ్గేనా

సిరా న్యూస్,ఒంగోలు;
ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో సీనియర్ నేతగా వున్న మాజీ మంత్రి మానుగుంట మహిధర్ రెడ్డి పార్టీ మారబోతున్నాడనే టాక్ జోరుగా నడుస్తోంది. నాలుగు సార్లు కందుకూరు ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన మహిధర్ రెడ్డి మొన్నటి ఎన్నికల ముందు నుంచే వైసీపీకి దూరంగా వుంటూ వస్తున్నారు. ప్రధానంగా కందుకూరు నియోజకవర్గంలో ముందు నుంచి మానుగుంట, దివి కుటుంబాల మధ్య రాజకీయాలు నడుస్తుండేవి. ఆ రెండు కుటుంబాల్లో ఏదో ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యవారు.ఆరు దశాబ్దాల నుంచి కందుకూరు నియోజకవర్గ రాజకీయాలను శాసిస్తుంది మానుగుంట కుటుంబం. మహిధర్ రెడ్డి తండ్రి ఆదినారాయణ రెడ్డి ఇక్కడి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పార్టీలో వున్న మహీధర రెడ్డి కందుకూరు నుంచి ఎమ్మెల్యే గా మూడు సార్లు గెలుపొందారు. కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల సమయానికి వైసీపీలో చేరిన మహీధర్‌రెడ్డి కందుకూరు నుంచి నాలుగో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా వున్న మహిధర్ రెడ్డిని మొన్నటి ఎన్నికల్లో వైసిపి అధిష్టానం పక్కన పెట్టింది. 2019 నుంచి ఐదేళ్లు వైసిపి ఎమ్మెల్యేగా వున్న మహీధర్ రెడ్డికి అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో భాగంగా మొన్నటి ఎన్నికల్లో టికెట్ కేటాయించలేదు. కందుకూరు టిక్కెట్ ను కనిగిరి ఎమ్మెల్యేగా వున్న బుర్ర మధుసూదన్ యాదవ్‌కు కేటాయించారు జగన్ . ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు మహీధర రెడ్డి వర్గీయులు. ఇదే సమయంలో మహిధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి టిడిపి నుంచి పోటీ చేస్తాడని ప్రచారం కూడా జరిగింది మహిధర్ రెడ్డి వైసీపీలోనే కొనసాగారు. తనను కాదని మరొక నియోజకవర్గ నుంచి వచ్చిన నేతకు టికెట్ ఇచ్చినా అందరూ సహకరించి పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అయితే మొన్నటి ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు చేతిలో మధుసూదన్ యాదవ్ ఓడిపోయాడు . మహిధర్ రెడ్డి పూర్తిస్థాయిలో పనిచేయలేదని.. ఆ కారణంగానే మధుసూదన్ యాదవ్ ఓటమి పాలయ్యారని ప్రచారం జరిగింది. మొన్నటి ఎన్నికల్లో అభ్యర్థి ప్రకటన నాటి నుంచి అసంతృప్తిగా ఉన్న మహిధర్ రెడ్డి ఎన్నికల తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. వైసిపి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.ఉమ్మడి జిల్లా కు చెందిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీ మారుతున్నారు. ఈ నేపథ్యంలోనే మహిధర్ రెడ్డి కూడా పార్టీ మారతాడనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రచారానికి అనుగుణంగానే కందుకూరు నియోజకవర్గం వైసీపీలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. కందుకూరులోని మహిదర్ రెడ్డి కార్యాలయంలో జగన్ ఫోటోను తీసివేశారు. దీంతోపాటు దసరా సందర్భంగా మహీధర్ రెడ్డి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసి ఫ్లెక్సీలలో జగన్ ఫోటో కనిపించలేదు. జగన్ ఫోటోలు తొలగించడం చూస్తుంటే మహీధర్ ఇక ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.నెల్లూరు టిడిపి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మహిధర్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ సాన్నిహిత్యంతోనే మహిధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో ఉండడం, ఆయనతో మహీధర్‌రెడ్డికి సాన్నిహిత్యం ఉండడంతో ఆయన బిజెపిలో చేరుతారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మహీధర్ రెడ్డి వైసీపీకి దూరం కాబోతున్నారనే సమాచారంతో వైసిపి అధిష్టానం అలర్ట్ అయిందట. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని కందుకూరు పంపించి మహీధర్ రెడ్డితో చర్చలు జరిపించారంట. దీంతోపాటు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా మహీధర్ రెడ్డి తో మంతనాలు జరిపినట్టు తెలుస్తుంది .వైసిపి అధిష్టానం బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మహిధర్ రెడ్డి మాత్రం ఓ నిర్ణయానికి వచ్చేసినట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. టిడిపి వైపుకు వెళ్లేందుకు ఆయన ఆసక్తిగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో జరగబోయే పునర్విభజనలో కందుకూరు నియోజకవర్గం రెండు నియోజకవర్గాలుగా ఏర్పడే అవకాశం ఉంది. దీంతో నియోజకవర్గ పునర్విభజన అనంతరం మహిధర్ రెడ్డి ఏ పార్టీలో చేరేది అనేదానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు
===========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *