ఏపీలో ఆరోగ్యశ్రీ పంచాయితీ

సిరా న్యూస్,విజయవాడ;
ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసేస్తారని వైసీపీతో పాటు కాంగ్రెస్ కొత్త అనుమానాలు వ్యక్తం చేస్తోంది. దీనికి కారణం కేంద్ర మంత్రి పెమ్మసాని చేసిన వ్యాఖ్యలే. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఉపయోగించుకోవాలని ఆయన గుంటూరులో పిలుపునిచ్చారు. ఆరోగ్యశ్రీ తీసేసి ఆయుష్మాన్ భారత్ ను పెడుతున్నారని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. తాజాగా షర్మిల కూడా ఇదే అంశంపై ట్వీట్ చేశారు. ఆరోగ్య శ్రీ పథకం అమలుపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు అనుమానాలు కలిగిస్తున్నాయని.. ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని పెమ్మసాని అంటున్నారని అంటే ఇక ఆరోగ్యశ్రీ లేనట్టేనా అని షర్మిల అనుమానం వ్యక్తం చేశారు. కేవలం ఆయుష్మాన్ భారత్ పథకాన్నే అమలు చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఆయుష్మాన్ భారత్ కింద కేంద్రం ఇచ్చే 5 లక్షలతోనే సరిపెడితే మరి రాష్ట్రం ఇచ్చేది ఏమీ లేదా.. ఆరోగ్యశ్రీ కింద ఇక వైద్యం ఉండదని చెప్పకనే చెబుతున్నారా అని షర్మిల ప్రశ్నించారు. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకంపై వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. షర్మిల ట్వీట్‌కు కేంద్ర మంత్రి పెమ్మసని చంద్రశేఖర్ కూడా స్పందించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోగ్యశ్రీకి ఆయుష్మాన్ భారత్ రీప్లేస్ మెంట్ కాదని స్పష్టం చేశారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేలా.. చర్యలు తీసుకునే ప్రయత్నమేనన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం విజన్ ఏమిటో ప్రజలకు అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ ప్రేరేపిత తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరన్నారు.పెమ్మసాని వివరణతో ఏపీలో ఆరోగ్యశ్రీకి డోకా లేదని.. స్పష్టమయిందని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *