ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి

సిరా న్యూస్,ఖమ్మం;
లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేసినట్లు ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.లోక్ సభ ఓట్ల లెక్కింపు ను ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో చేపట్టనున్నట్లు ఆయన అన్నారు.లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల 7, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకు ఒకటి, మొత్తం 8 హాళ్లు ఏర్పాటుచేసినట్లు, ఒక్కో హాల్లో 14 టేబుళ్ల చొప్పున, ఒక్క ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ లో 355 పోలింగ్ కేంద్రాలు వున్నందున అక్కడ 18 టేబుళ్లు ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. పోటీచేసిన అభ్యర్థులు 117 మంది ఏజెంట్ల ను నియమించవచ్చని, ఏజెంట్ల వివరాలు ఫారం 18 లో సమర్పించాలని ఆయన అన్నారు. ఏజెంట్ల వివరాలు గురువారం సాయంత్రం లోగా సమర్పించాలన్నారు. జూన్ 4 న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని, ఉదయం 5 గంటలకు ఇవిఎం స్ట్రాంగ్ రూంలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, పోటీ అభ్యర్థుల సమక్షంలో తెరవడం జరుగుతుందని ఆయన అన్నారు. పోటీ అభ్యర్థులు, చీఫ్ ఏజంట్లు సమయానికి కౌంటింగ్ కేంద్రానికి చేరాలన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం 6.30 గంటలకల్లా కౌంటింగ్ కేంద్రానికి చేరాలన్నారు. ఏజెంట్లు పాసుల కొరకు 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్ల అనుమతి లేదని ఆయన అన్నారు. ఈ నెల 13న పోలింగ్ అనంతరం ఇవిఎం యంత్రాలను శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంకు తరలించి, 3 అంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు స్ట్రాంగ్ రూంలను సందర్శించవచ్చని ఆయన అన్నారు.
వరంగల్-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నెల 27 న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 83,879 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదైనట్లు, జిల్లా వ్యాప్తంగా 118 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేసినట్లు, పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్నట్లు ఆయన అన్నారు. బ్యాలెట్ పేపర్ల ద్వారా పోలింగ్ జరుగుతుందని, పోలింగ్ కొరకు రిజర్వ్ తో సహా 129 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. 15 సెక్టార్ లు ఏర్పాటుచేసి, తహశీల్దార్లను సెక్టార్ అధికారులుగా నియమించినట్లు ఆయన అన్నారు. ఈ నెల 26న ఎస్ఆర్ అండ్ బిజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఏర్పాటుచేయనున్నట్లు, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు నల్గొండ లోని స్ట్రాంగ్ రూంకు పంపనున్నట్లు, కౌంటింగ్ జూన్ 5 న నల్గొండలో జరగనున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు, నోటా తో కలుపుకుని 53 ఉన్నట్లు, ప్రాధాన్యత క్రమంగా తమ ఓటును వేయాల్సి ఉంటుందని, ఓటు వేయాల్సిన ప్రక్రియపై కలెక్టర్ అవగాహన కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *