ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో నీటమునిగిన చెన్నపట్నం
సిరా న్యూస్,చెన్నై ;
మిగ్‌జాం తీవ్రతుఫాను తమిళనాడు రాజధాని చెన్నైని ముంచెత్తింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో చెన్నపట్నం నీటమునిగింది. భారీ వర్షాల ధాటికి వరదలు పోటెత్తడంతో చాలా ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరుచేరింది. లోతట్టు ప్రాంతాల్లో ఛాతీ వరకు నీళ్లు ప్రవహిస్తున్నాయి. చెంబరంబాక్కమ్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల చాలా ప్రాంతాలు నదులు, సరస్సులను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు ఇండ్లపైకి చేరారు. కూవమ్ నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో నెర్కుంద్రమ్ ప్రాంతంలోని బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తున్నది. కాగా, మిగ్‌జాం తుఫాను వల్ల చెన్నైలో ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య ఎనిమిదికి పెరిగిందని పోలీసులు తెలిపారు.తుఫాను ప్రభావంతో తమిళనాడులోని పది జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. చెన్నై, తిరువల్లూరు, చెంగల్పట్టూ, కాంచీపురం, రాణిపేట్, వెళ్లూరు, తిరుపత్తూరు, తిరువన్నమళై, విళ్లుపురం, కన్యాకుమారి జిల్లాల్లో వర్షం కురుస్తుందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.
విద్యాసంస్థలకు సెలవు
2015నాటి తుఫాన్ విపత్తును గుర్తుకుతెస్తూ చెన్నైలో మిజ్‌జాం బీభత్సం సృష్టించింది. రోడ్డపై పెద్దయెత్తున వరద నీరు చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లోని విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు, బ్యాంకులకు మంగళవారం సెలవు ప్రకటించారు.