సిరా న్యూస్, హైదరాబాద్:
తెలుగు వారియర్స్ ఘన విజయం.. అశ్విన్ వన్ మ్యాన్ షో..
థమన్ మెరుపులు..
ఇండియాలో క్రికెట్, సినిమాకు ఉన్న ఆదరణ మరో దానికి ఉండదన్న విషయం తెలిసిందే. ఒక మూవీ విడుదలైనా.. క్రికెట్ మ్యాచ్ వచ్చినా ప్రతి ఒక్కరూ పండుగలా జరుపుతుంటారు.అలాంటిది సినిమా స్టార్లే క్రికెట్ ఆడితే.. అది ఎంతటి సక్సెస్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా పదేళ్ల క్రితం మొదలు పెట్టిందే ‘సెలెబ్రిటీ క్రికెట్ లీగ్’ (సీసీఎల్). తాజాగా షార్జాలో ఈ లీగ్ పదో ఎడిషన్ ప్రారంభం అయింది. ఇందులో జరిగిన రెండో మ్యాచ్‌లో సీజన్‌లో తెలుగు వారియర్స్ టీమ్ విజయంతో టోర్నీని ప్రారంభించింది. ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!
భోజ్‌పురితో మొదటి మ్యాచ్ : ఇండియా వ్యాప్తంగా ఎంతో ఆదరణను సొంతం చేసుకుని సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోన్న ‘సెలెబ్రిటీ క్రికెట్ లీగ్’ (సీసీఎల్) కొత్త సీజన్ తాజాగా మొదలైంది. ఇందులో గతంలో పలుమార్లు టైటిల్ గెలిచిన తెలుగు టైటాన్స్ జట్టు.. భోజ్‌పురి దబాంగ్స్ టీమ్‌తో శనివారం తలపడింది. మన జట్టుకు అఖిల్ అక్కినేని కెప్టెన్‌గా వ్యవహరించగా.. భోజ్‌పురికి మనోజ్ తివారి నాయకత్వం వహించారు.మొదటి ఇన్నింగ్స్‌లో ఇలా : భోజ్‌పురి దబాంగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ మొదటి ఇన్నింగ్స్‌లో నిర్ణీత పది ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. మన జట్టులో అశ్విన్ బాబు 37 పరుగులు చేశాడు. థమన్ కూడా అతడికి చక్కని సహకారం అందించాడు. ఇక, భోజ్‌పురి టీమ్‌లో ఖాన్ రెండు ఓవర్లు బౌలింగ్ వేసి ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
భోజ్‌పురి ఫస్ట్ ఇన్నింగ్స్ : తెలుగు వారియర్స్ 94 పరుగులు చేసిన తర్వాత భోజ్‌పురి దబాంగ్స్ మొదటి ఇన్నింగ్స్‌లో పది ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 103 పరుగులు సాధించింది. ఆ జట్టులో ఆదిత్య ఓజా 43 పరుగులు చేశాడు. తెలుగు జట్టులో సామ్రాట్ 1 వికెట్‌తో మెరుగైన ప్రదర్శన చేశాడు. మొత్తంగా మొదటి ఇన్నింగ్స్‌లో భోజ్‌పురి టీమ్‌కు 9 పరుగుల ఆధిక్యం లభించింది.రెండో ఇన్నింగ్స్‌లో సత్తా : 9 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తెలుగు వారియర్స్‌కు అశ్విన్, థమన్ చక్కని భాగస్వామ్యం అందించారు. వీళ్లిద్దరూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ పది ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 118 పరుగులు సాధించారు. ఇక, ఈ ఇన్నింగ్స్‌లో అశ్విన్ 56, థమన్ 45 పరుగులు చేశారు. భోజ్‌పురి బౌలర్లలో ఆదిత్య ఒక వికెట్ తీశాడు.భారీ టార్గెట్‌తో బరిలోకి : ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 9 పరుగుల ఆధిక్యం ఉండడంతో భోజ్‌పురి టీమ్ విజయానికి 10 ఓవర్లలో 110 చేయాల్సి వచ్చింది. అయితే, ఈ జట్టు పది ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 101 పరుగులు మాత్రమే చేసింది. దీంతో తెలుగు వారియర్స్ జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ఈ టోర్నీని విజయంతో మొదలు పెట్టేసింది.వాళ్లిద్దరూ అదుర్స్ : భోజ్‌పురి దబాంగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ బాబు రెండు ఇన్నింగ్స్‌ల్లో 37, 56 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ రాణించి వన్ మ్యాన్ షో చేశాడు. థమన్ కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. వీళ్లిద్దరూ అదుర్స్ అనిపించారు. ఇక, భోజ్‌పురి టీమ్‌లో ఆదిత్య ఓజా 43, 47 పరుగులు చేయడంతో పాటు వికెట్‌ను కూడా తీసుకున్నాడు. ఈ విజయంతో తెలుగు వారియర్స్ పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్‌కు చేరుకుంది.