సిరా న్యూస్,గుంటూరు;
వారిద్దరూ స్నేహితులు. కలిసి తిరిగారు. ఫ్రెండ్ అంటే నువ్వేరా అనుకునేలా ఉండేవారు. కానీ జస్ట్ ఒక్క ఘటన వారిలో ఒకరిని లోకం నుండే లేకుండా చేసింది. మరొకరిని కటకటాల పాలు చేసింది. ఇంతకు ఆ ఫ్రెండ్షిప్ మధ్య ఏమి జరిగింది ? తీరని లోకాలకు ఆ ఫ్రెండ్ వెళ్లేందుకు కారకుడు ఇతనే ఎందుకయ్యాడు ? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇంతకు ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు ఏపీలోని తెనాలిలో.తెనాలి అంటేనే శాంతియుత వాతావరణానికి పేరుగాంచిన నగరంగా పేరు. ఈ నగరాన్ని ఆంధ్ర ముంబాయి అని కూడా అంటారు. అలాంటి నగరంలో ఈ నెల 2వ తేదీన రహదారి ప్రక్కన ఓ మృతదేహం, స్థానికుల కంటపడింది. సమాచారం అందుకున్న తెనాలి రూరల్ పోలీసులు ఘటనా స్థలి వద్దకు ఎంటరయ్యారు. మృతదేహం చూస్తే హత్య గావించబడినట్లే ఉంది.. అసలు ఎవరు ఈ హతుడంటూ.. పోలీసులు వివరాలు ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. ఇక అసలు కథ తెలుసుకొనే పనిలో పడ్డ పోలీసులకు షాకిచ్చే విషయాలను తెలుసుకున్నారు. నిందితుడిని అతి తక్కువ కాలవ్యవధిలో పోలీసులు అరెస్ట్ చేయడంతో.. పోలీసుల పనితీరుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.తెనాలికి చెందిన బౌన్సర్ కోటేశ్వరరావు , షఫీ లు మంచి మిత్రులు. ఇద్దరూ కలిసి తిరిగేవారు. అయితే అత్యవసర ఖర్చుల నిమిత్తం కోటేశ్వరరావు వద్ద షఫీ రూ. 10 వేలు అప్పు తీసుకున్నాడు. తీసుకున్నాడే కానీ తిరిగి చెల్లించలేదు షఫీ. ఇక చూశాడు కోటేశ్వరరావు.. రోజూ డబ్బులు ఇవ్వాలని అడిగేవాడు. అది కూడా రాత్రి వేళల్లో ఫోన్ చేయడం డబ్బులు ఇస్తావా లేదా.. లేకుంటే నీ భార్యను నా దగ్గరికి పంపించేయ్ అంటూ కోటేశ్వరరావు దుర్భాషలాడాడు.ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న షఫీ ఈనెల 1వ తేదీన మందు త్రాగుదాం రమ్మంటూ కోటేశ్వరరావు కి ఫోన్ చేశాడు. ఇక ఆ మాట విన్న వెంటనే తను కూడా బుర్రిపాలెం వద్ద గల ఖాళీ ప్రదేశానికి చేరుకొని మందు త్రాగాడు. ఇక తన భార్యను పంపమని కోరిన కోటేశ్వరరావును తాను తెచ్చుకున్న కత్తితో షఫీ పొడిచి హత్య చేశాడు. ఇక అంతే కోటేశ్వరరావు అక్కడే ప్రాణాలు వదిలాడు. హత్యకు ముందు రాత్రి కోటేశ్వరావు తన స్నేహితుడు ఆదాం షఫీతో ఉన్నట్లు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. ఈ క్లూ ఆధారంగా పోలీసులు ఆదాం షఫీని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అయితే గతంలో వీరిద్దరూ మంచి స్నేహితులని అయితే హత్య చేయాల్సినంత గొడవలు ఇద్దరి మధ్య ఏమీ లేవని మొదట కుటుంబసభ్యులు భావించారు. అయితే పోలీస్ విచారణలో షఫీ విస్తుపోయే నిజాలు బయట పెట్టాడు.కొద్దీ రోజుల క్రితం కోటేశ్వరావు వద్ద నుంచి షఫీ పదివేల రూపాయల అప్పు తీసుకున్నాడు. అప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్న కోటేశ్వరావు తరుచూ ఫోన్ చేసి అప్పు తీర్చాలని అడిగేవాడు. దీంతో మనస్థాపానికి గురైన షఫీ కోటేవ్వరావుపై కక్ష పెంచుకున్నాడు. వెంటనే ఒక కత్తి కొనుగోలు చేశాడు. మద్యం సేవిద్దామని తెనాలి రావాల్సిందిగా కోటేశ్వరావుకు ఫోన్ చేసి చెప్పాడు.దీంతో తెనాలి వచ్చిన కోటేశ్వరావు షఫీతో కలిసి బుర్రిపాలెం రోడ్డులో వారిద్దరూ కలిసి మద్యం సేవించే ప్రాంతానికి వెళ్లారు. పుల్‌గా మద్యం సేవించారు. ఈక్రమంలోనే కోటేశ్వరావు మరోసారి షఫీ వద్ద అప్పు ప్రస్తావన తీసుకొచ్చాడు. ఇందుకోసమే ఎదురు చూస్తున్న షపీ వెంటనే తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న కోటేశ్వరావు వెంటనే చనిపోయాడు. తెల్లవారిన తర్వాతే కోటేశ్వరావు హత్య గురించి బయట పడింది. అయితే పోలీసులు విచారణలో షఫీ ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో పూసగుచ్చినట్లు చెప్పాడు. దీంతో షఫీని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.అయితే ట్రైనీ డిఎస్పీ భార్గవి, సిఐ శ్రీనివాసరావు, ఎస్సై ప్రతాప్ లు ముమ్మర దర్యాప్తు నిర్వహించి, నిందితుడు షఫీని అరెస్ట్ చేశారు. ఒక అప్పుతో మొదలైన వీరి స్నేహబంధం వివాదం.. చివరికి ఒక మిత్రుడి చావు వరకు తీసుకెళ్ళింది. మరొక మిత్రుడిని కటకటాల పాలు చేసింది.