తలకు మించిన భారంగా హామీలు
సిరా న్యూస్, రాజమండ్రి;
ఓవైపు అంగన్వాడీలు 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్, అవుట్‌సోర్స్ ఉద్యోగులు కూడా అదే బాట పట్టబోతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వీళ్లంతా రోడ్డు ఎక్కుతున్నారు. ఎన్నికల కోసం వైసీపీ సిద్ధమవుతున్న టైంలో రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు ఆ పార్టీని కలవర పెడుతున్నాయి. సమస్యల పరిష్కారం కోసం ఒక్కొక్కరుగా కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు రోడ్లపైకి వస్తున్నారు. ఇప్పటికే 15 రోజులుగా సమ్మెలో ఉన్న అంగన్‌వాడీలు తమ డిమాండ్ పూర్తిగా నెరవేర్చే వరకు తగ్గేదేలే అంటున్నారు. వీళ్లకు ఇప్పుడు మిగతా శాఖల కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా జత కలవబోతున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న టైంలో జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రలో వివిధ వర్గాలకు హామీలు ఇచ్చారు. వాటినే అమలు చేయాలనే డిమాండ్ తీవ్రమవుతోంది. అలా డిమాండ్ చేస్తూ రోడ్డు ఎక్కిన వారిలో ముందు వరసలో ఉన్నారు అంగన్వా డీ వారిని చూసి ఇప్పుడు సమగ్ర శిక్ష సిబ్బంది కూడా ఆందోళన బాటపడుతోంది. గతంలో ఎన్నడు లేనివిధంగా దాదాపు 15 రోజులుగా అంగన్‌వాడీలు చేస్తున్న ఆందోళన కారణంగా సెంటర్‌లు మూతపడ్డాయి. ఐదు రోజులుగా సమగ్ర శిక్ష సిబ్బంది కూడా సమ్మె చేస్తున్నారు. మునిసిపల్ కార్మికులు కూడా అదే దారిలో వెళ్లనున్నారు. సమస్యల పరిష్కారం కోరుతు సమ్మె నోటీసు ఇచ్చారు. వీళ్లందరికీ తోడు గురువారం నుంచి వీఆర్‌ఏలు నిరసనలకు పిలుపునిచ్చారు. కొత్త ఏడాదిలో ఫీల్డ్ అసిస్టెంటులు చలో విజయవాడ అంటున్నారు.ఇలా ఒక్కొక్కరు రోడ్లపైకి వస్తుండటం వారికి ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వడంతో అధికార పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ పరిస్థితి శాంతింప జేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వడం లేదు. ఆయా సంఘాలతో జరుపుతున్న చర్చల్లో పురోగతి కనిపించడం లేదు. సాధారణ డిమాండ్‌లకు ప్రభుత్వం ఓకే చెబుతున్నా… ఉద్యోగుల జీతాల పెంపునకు మాత్రం ప్రభుత్వం ముందుకు రావడం లేదు. అక్కడే చర్చలు విఫలమవుతున్నాయి. ఇప్పటికే సమ్మె బాటలో ఉన్న అంగన్‌వాడీలకు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసినా స్పందన రావడం లేదు. దీనిపై ఉద్యోగులు మరింత గరం అవుతున్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం మరింత జటిలం చేస్తోందని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు చలో విజయవాడ పిలుపునిస్తే ఉక్కుపాదంలో అణిచవేసింది ప్రభుత్వం. ఇప్పుడు అంగన్వాడీల ఆందోళనలను కూడా అదే మాదిరిగా చల్లార్చాలని ప్రయత్నించి విఫలమైంది. ఎన్నికలు దగ్గరపడుతున్న టైంలో వారిపై దుందుడుకు చర్యలు కూడా తీసుకోలేకపోతోంది. ఆచితూచి వ్యవహరిస్తోంది. అందుకే వారిని స్ఫూర్తిగా తీసుకుంటున్న మిగతా విభాగాలకు చెందిన ఉద్యోగులు కూడా సమ్మె సైరన్ మోగిస్తున్నారు. ఇలా ఒక్కొక్కరుగా సమస్యల పరిష్కరించాలని రోడ్లపైకి వస్తుండటం అధికార పార్టీకి మింగుడుపడటం లేదు. ఎన్నికల కాలంలో ఇది ఎటు దారి తీస్తుందో అన్న కంగారు మాత్రం వారిలో కనిపిస్తోంది. గతంలో అండగా నిలిచిన వర్గాలు ఇలా ఎదురు తిరగడం కలవరపరుస్తోంది. ఆందోళన చేస్తున్న ఆయా వర్గాలు కనిపించిన వైసీపీ లీడర్లను కలిసి తమ విన్నపాలు తెలియజేస్తున్నారు. వారు ఏమైనా తేడాగా మాట్లాడితే అక్కడే ఇచ్చిపడేస్తున్నారు. అందుకే తమకు డిమాండ్ విన్నవించడానికి వస్తున్న వారిని సాదరంగా ఆహ్వానించి ఎలాంటి హామీలు ఇవ్వకుండా పరిశీలిస్తాం చూస్తాం చెబుతాం అన్న డైలాగ్‌లకే పరిమితం అవుతున్నారు.ఈ మధ్య చర్చల సందర్భంగా మంత్రి ఉషశ్రీ చేసిన కామెంట్స్‌పై అంగన్‌వాడీలు తీవ్రంగా మండిపడ్డారు. మొబైల్ బిల్స్, చీరపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వైసీపీకి చెందిన ఓ లీడర్ కూడా వీళ్లపై రుసరుసలాడారు. దీనిపై కూడా అంగన్‌వాడీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా సమ్మె చేస్తున్న వారిపై కామెంట్స్ వివాదాస్పదం కావడంతో మిగిలిన నేతలు అలర్ట్ అయ్యారు. వాళ్లు మౌన వృత్తాన్ని పాటిస్తున్నారు.