సిరాన్యూస్, బోథ్
అభివృద్ధిని విస్మరించిన గత పాలకులు
* కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ
ఆదివాసి గిరిజన గ్రామాల అభివృద్ధిని గత పాలకులు విస్మరించారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. బుధవారం మండలంలోని మహాదు గూడ, కేశవ్ గూడ, జైతు గూడా, సోనాల గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన గ్రామాలు అభివృద్ధిని పాలకులు విస్మరించడం జరిగిందన్నారు. వజ్జర్ ప్రాంతంలో తాగునీటి సమస్యను పరిష్కరించడంలో మాజీ ఎంపీ జి నగేష్ విఫలమయ్యారన్నారు. ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన మారుమూల గ్రామాల సమస్యలపై దృష్టి సారించలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గ్రామాల్లో ప్రతి ఏటా 50 శాతం ఇండ్ల నిర్మాణం ఆదివాసీలకు ఇస్తామన్నారు. వజ్జర్ ప్రాంతంలో తాగునీటి సమస్య లేకుండా చూడడంతోపాటు పోడు రైతులందరికీ పట్టా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందని, పథకం ద్వారా ఆదివాసులకు ఉపాధి లభిస్తుందన్నారు. ఉపాధి హామీ కూలీకి రోజుకు 400 రూపాయలు అందే విధంగా కాంగ్రెస్ పార్టీ చూస్తుందన్నారు. ఆగస్టు నెలలో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడ గజేందర్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చంటి, మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ ఇస్రు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎఎంసి డైరెక్టర్ పోశెట్టి గాజుల, పోతన్న, అనిల్, విజయభాస్కర్, భక్తుల రమేష్ తదితరులు పాల్గొన్నారు