సిరా న్యూస్,అనంతపురం;
అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాల వెంకటాపురం గ్రామంలో మహిళపై గ్రామస్థుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై ఆమె గట్టిగా నిలదీసింది. దీన్ని మనసులో పెట్టుకున్న ఆ వ్యక్తి ఆమెపై దాడికి పాల్పడ్డాడు.పాల వెంకటాపురం గ్రామానికి చెందిన నటరాజు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయంలో నిలదీయడంతో లక్ష్మీపై అతను దాడి చేశాడు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న వ్యక్తి చిత్రీకరించాడు. ఈ వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఈ ఘటన జరిగినట్లు పోలీసుల దృష్టికి రావడంతో బ్రహ్మసముద్రం ఎస్సై పరశురాముడు ఆధ్వర్యంలో పోలీసులు ఆ గ్రామానికి చేరుకున్నారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. ఘటనా స్థలానికి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. దాడి జరిగిందని నిర్దారించకున్నారు.
లక్ష్మీపై దాడి చేసిన నటరాజుపై బ్రహ్మసముద్రం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై పరశురాముడు తెలిపారు. గాయపడిన మహిళను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని ఎస్సై పేర్కొన్నారు.శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ నియోజకవర్గం అయినా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ దారుణం జరిగింది. నిందితుడు వైసిపి గ్రామ కన్వీనర్ కావడంతో ఈ కేసులోకి రాజకీయం ఎంటర్ అయింది. తన కోరిక తీర్చాలంటూ వికృత చేష్టలకు దిగడంతోనే ఆమె తిరగబడిందని అంటున్నారు. బాధితురాలు టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తోంది. శుక్రవారం సాయంత్రం బలవంతం చేయబోయాడని స్థానికులు చెబుతున్నారు. ఆమె ఎదురు తిరిగింది. తన మాట వినలేదని ఆమెను నడిరోడ్డుపై చితకబాదాడు. గ్రామస్థులు అడ్డు వస్తున్నా వినలేదు. జుట్టు పట్టి నేలకేసి బాదాడు. గ్రామస్తులు కలగజేసుకుని విడిపించారు. అప్పటికే గాయాల పాలైన బాధితురాలిని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బ్రహ్మసముద్రం పోలీసులకు మహిళ ఫిర్యాదు చేసింది . నటరాజ్ తనకు పరిచయం కూడా లేడని అయితే తనను బలవంతం చేయబోయాడని సదరు బాధిత మహిళ మీడియాకు తెలిపింది.