Bhatti Vikramarka: ఆదిలాబాద్ ను గుండెల్లో పెట్టుకుని చూసే ప్రభుత్వం మాది:  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సిరాన్యూస్‌, బ‌జార్‌హ‌త్నూర్‌
ఆదిలాబాద్ ను గుండెల్లో పెట్టుకుని చూసే ప్రభుత్వం మాది:  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
* పాదయాత్రలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటా
* పిప్పిరి ఎత్తిపోతల పథకం, మంచిర్యాలలో రిటైనింగ్ వాల్ కు నిధులు మంజూరు
* బుగ్గారం, తేజ్పూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు ఇస్తానని హామీ
* పిప్పిరి గ్రామస్తుల నిండు ఆశీర్వాదంతో పాదయాత్ర పూర్తి చేశా

గుండెల నిండా ప్రేమను పంచేటువంటి ప్రజలున్న ఆదిలాబాద్ జిల్లా వెనుకబడి ఉండటానికి వీలులేదని అన్ని జిల్లాలతో సమానంగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లాను మా గుండెల్లో పెట్టి చూసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బోధ్‌ నియోజకవర్గం పిప్పిరి గ్రామంలో పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి భట్టి విక్రమార్క మాట్లాడారు. పాదయాత్ర ప్రారంభానికి తొలి అడుగు నేలైన పిప్పిరి గ్రామాన్ని దత్తత తీసుకున్న భట్టి విక్రమార్క తన పర్యటనలో వరాల జల్లులు కురిపించారు. పిప్పిరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 45 కోట్లు, పిప్పిరి గ్రామంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి నిధులు ఇస్తామని ప్రకటించారు. బుగ్గారం, తేజ్పూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
మీ భూములు మీకే ఇచ్చి.. దుక్కి దున్నిస్తా…
పాదయాత్ర చేస్తున్న క్రమంలో బూసిమెట్ట గ్రామానికి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పట్టా భూములను  ధరణి తీసుకొచ్చి బిఆర్ఎస్ ప్రభుత్వం హక్కులను తీసివేసిందని  ఆదివాసి రైతులు మొరపెట్టుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం తీసుకువచ్చి మా భూముల్లోకి తీసుకువెళ్లి అరకలు కట్టించి భూములు దున్నించాలని ఆనాడు వాగ్దానం తీసుకున్నారు. వారి వాగ్దానాన్ని కచ్చితంగా ఈ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందని భట్టి భరోసా ఇచ్చారు. మీ ఊరికి వస్తాం మీ భూములు మీకే ఇస్తాం పట్టాలు ఇస్తాం భూముల్లోకి తీసుకువెళ్లి దుక్కి దున్నిస్తాం. పంటలు పండిస్తాం. పంటలు పండించడానికి కావలసిన రుణాలు కూడా ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం ఇస్తుందని ఆదివాసి గిరిజన రైతులకు హామీ ఇచ్చారు. పాదయాత్రలో గిరిజనేతర రైతులు నన్ను కలిసి ధరణి వల్ల భూమిపై హక్కులు లేకుండా చేసిందని మొరపెట్టుకున్నారు. ధరణిని బంగాళాఖాతంలో వేసి మీ హక్కులు మీకు కల్పిస్తామని ఆరోజున ఇక్కడి నుంచే మాట ఇచ్చిన ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి ప్రక్షాళన కోసం సబ్ కమిటీ వేశామని, ఆ కమిటీ అధ్యయనం చేస్తున్నదని వివరించారు. 2023 మార్చి 16న పిప్పిరి నుంచి మండు టెండల్లో పాదయాత్ర ప్రారంభించినప్పుడు రెండు మూడు రోజుల్లోనే పాదయాత్ర ఆగిపోతుందని, ముందుకు సాగదని చాలామంది అన్నారు. కానీ పిప్పిరి గ్రామ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో జులై రెండు వరకు వెయ్యి గ్రామాలు కదిలిస్తూ నడుస్తూ పాదయాత్రను పూర్తి చేశానని చెప్పారు. పాదయాత్రలో ఎండలకు ఎండినం.., వానలకు తడిసినం అయినప్పటికీ ఎక్కడ కూడా పాదయాత్రను ఆపలేదంటే పిప్పిరి గ్రామస్తులు నిండు మనసుతో దీవించి పంపడంతో ఎన్ని అడ్డంకులు వచ్చిన పాదయాత్ర ఆగలేదన్నారు. పాదయాత్రలో ఆదిలాబాద్ ప్రజల గుండెచప్పుడు విన్నానని, కొండల్లో గూడేల్లో గుడిసెల్లో ఎండిన బీడు భూముల్లో ప్రజలు చెప్పిన ప్రజా సమస్యల విని తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం తీసుకురావాలని కంకణ బద్ధులమై పాదయాత్ర పూర్తి చేసే ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 32 రోజులపాటు పాదయాత్ర చేసిన సందర్భంలో ఇక్కడి రైతులు చిక్మాన్ కుప్టీ, త్రివేణి సంగమం పులిమడుగు వాగు ఆడ వద్ద ఉన్న కొమరం భీమ్ ప్రాజెక్టు కెనాల్స్, సుద్దన్న వాగు, గొల్ల వాగు, గడ్డన్న వాగు తదితర మీడియం మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించాలని కోరడంతో గత బడ్జెట్లో వాటిని పూర్తి చేయడానికి 400 కోట్లకు పైగా నిధులను కేటాయించినట్లు వెల్లడించారు.తుమ్మిడి హెట్టి వద్ద మొదలుపెట్టిన ప్రాజెక్టును గత ప్రభుత్వం నిలిపివేసిందని ఆనాడు పాదయాత్రలో మాట ఇచ్చిన ప్రకారంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పుణ ప్రారంభించి నాలుగైదు నెలల్లో పనులు మొదలుపెట్టి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకి నీళ్లు ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిర్వీర్యమైన ఐటీడీఏ లను పరిపుష్టి చేయడానికి ప్రజా ప్రభుత్వం ఈ బడ్జెట్లో గిరిజన సంక్షేమం కోసం 17,000 కోట్లు, ఎస్పీ డెవలప్మెంట్ కోసం 33 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించిందని వివరించారు. రాళ్ల వాగు బ్యాక్ వాటర్ తో ముంపునకు గురవుతున్న మంచిర్యాల పట్టణానికి రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం ఈ బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు కేటాయించమన్నారు.సదర్మట్ ప్రాజెక్టు ను నెల రోజుల్లో పూర్తిచేసి నీళ్లు అందిస్తామన్నూ. పెనుగంగ పైన ఉన్న ప్రాజెక్టులను గత ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసి నిర్లక్ష్యం చేసిందని, ప్రజా ప్రభుత్వం వాటిని పూర్తిచేస్తుందని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *