సిరాన్యూస్, భీమదేవరపల్లి
భీమదేవరపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీల ధర్నా
తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేత
ఆల్ ఇండియా డిమాండ్స్ డే సందర్భంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ఆశా కార్యకర్తలు, అంగన్వాడి టీచర్లు, ఆయాలు ధర్నా చేపట్టారు. అనంతరం పలు డిమాండ్‌లతో కూడిన వినతి ప్రతాన్ని తహసీల్దార్ కు అందజేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సమ్మె చేసిన తమ డిమాండ్లను పరిష్కరించ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లో తమ సమస్యలను పరిష్కరిస్తామన్నా ఇప్పటి వరకు మా సమస్యలు పట్టించుకోలేదని తెలిపారు. కనీస వేతనం 26 వేల రూపాయలతో పాటు, ఆన్లైన్ వర్క్ తో పెరిగిన పనిభారాన్ని తగ్గించాలని ఆశ కార్యకర్తలు డిమాండ్ చేశారు. సర్వేల పేరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. పని భారం ఎక్కువై చనిపోయిన ఆశ కార్యకర్తలకు 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు 65 సంవత్సరాలు నిండిన అంగన్వాడి టీచర్లు, ఆయాలను విధులకు రావద్దని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని అంగన్వాడి టీచర్లు వాపోయారు. 65 సంవత్సరాల నిండిన అంగన్వాడి టీచర్లకు రెండు లక్షల రూపాయలు, ఆయాలకు లక్ష రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, అంగన్వాడి టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.